‘తెలంగాణలో 38లక్షల నకిలీ ఓట్లు’

హైదారబాద్‌: తెలంగాణ ఓటర్ల జాబితాలోని అవకతవకలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ మనుసింఘ్వీ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని ఆయన విమర్శించారు. ఓటర్ల జాబితాలో 70లక్షల ఓటర్లపై గందరగోళ పరిస్థితి నెలకొందని.. జాబితాను సరిచేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని సింఘ్వీ‌ ప్రశ్నించారు.30లక్షల నకిలీ ఓట్లు..17లక్షల మందికి తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని తమ పరిశీలనలో వెల్లడైందని ఆయన వివరించారు. వీటన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, అధికారుల స్పందన అసంతృప్తినిచ్చిందని సింఘ్వీ తెలిపారు. ఓటర్ల జాబితాలోని అవకతవకలపై త్వరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని వెల్లడించారు. తప్పుల సవరణకు ఎన్నికల సంఘం చెబుతున్న నాలుగు వారాల సమయం సరిపోదని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు.