తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు..అభినందనీయం..
–ప్రభుత్వానికి, సీఎం కెసిఆర్ కు, మంత్రి ఎర్రబెల్లికి ధన్యవాదాలు
–రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లిని కలిసి ప్రశంసించిన నాటి తెలంగాణ సమర యోధులు
— వారికి కృతజ్ఞతలు తెలిపి, సత్కరించిన మంత్రి దయాకర్ రావు.
–ఈ ఘనత సీఎం కెసిఆర్ దేనని వ్యాఖ్యలు…
హన్మకొండ బ్యూరో చీఫ్ సెప్టెంబర్ 15 జనంసాక్షి
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడం వల్లే ఇది సాధ్యపడింది. సిఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల చొరవకు ధన్యవాదాలు మొత్తం ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అంటూ నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు కత్తెరశాల కుమరయ్య (95), అడవయ్య బేరే (91) లు అన్నారు. ఈ నెల 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో, వరంగల్ హన్మకొండలోని మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో వారు మంత్రి ఎర్రబెల్లి ని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాడు తెలంగాణ కోసం పోరాటం చేశామని, జైళ్ళకు వెళ్ళామన్నారు. ఆనాడు ఆనాటి వ్యవస్థపై అణచివేత విపరీతంగా ఉండేదన్నారు. వాటిని భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూడలేకే తాము ప్రత్యక్షంగా పోరాటం చేశామన్నారు. ఖిలా వరంగల్ పడమటి కోటకు చెందిన కుమరయ్య మాట్లాడుతూ, తాను ఇటిక్యాల మధుసూదన్ రావు, ఆరెల్లి బుచ్చయ్య, అడబాల సత్యనారాయణలతో కలిసి పనిచేశామన్నారు. ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభ ప్రభావం ఎక్కువగా తమపై ఉండేదన్నారు. గాంధీగారి స్ఫూర్తితో ఆనాడు సేవాదల్ లో కూడా పని చేశామన్నారు. అలాగే, హన్మకొండ బాల సముద్రంకు చెందిన అడవయ్య బేరే మాట్లాడుతూ, ఇటిక్యాల మధుసూదన్ రావు, హయగ్రీవాచారితో కలిసి పని చేశామన్నారు. 1958లో నెహ్రూను కలిసిన, లాల్ బహదూర్ శాస్త్రీ కుమారుడు సునీల్ శాస్త్రీతో కలిసిన, మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ తో కలిసిన, కొండా లక్ష్మణ్ బాపూజీతో ఢిల్లీలో ఆందోళనలు చేసిన, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీతో కలిసి దిగన ఫోటోలను ఆయన మంత్రికి చూపించి వాటి సందర్భాలను మంత్రి ఎర్రబెల్లికి వారు వివరించారు.
కాగా, మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, వారి ఆనాటి పోరాట స్ఫూర్తితోనే సిఎం కెసిఆర్ తెలంగాణ ఉద్యమం చేశారని, గాంధీజీ చూపిన శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వారికి తెలిపారు. మీ త్యాగల ఫలితమే నేటి దేశం, తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. వారిని అభినందిస్తూ మంత్రి వారికి సన్మానం చేశారు.