తెలంగాణ పౌర సమాజం తరపున ఎంపీలకు లేఖలు రాస్తాం
ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యక్తికి, విలువలకు మధ్య జరుగుతున్న పోటీ
పార్టీ వాళ్లకే ఓటు వేయాలనే నిబంధన ఎక్కడా లేదు
విలువలకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఓటు వేయండి
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా పౌర సమాజం నిలబడాలని తీర్మానం
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడితే నిత్యం బాధపడిన వ్యక్తి జస్టిస్ బీఎస్ రెడ్డి
రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రముఖ వక్తల అభిప్రాయం
హైదరాబాద్, సెప్టెంబర్ 1 : ఉప రాష్ట్రపతి ఎన్నిక వ్యక్తికీ, విలువలకు మధ్య జరుగుతున్న పోటీ అని, ఎంపీలు ఎటువైపు నిలబడతారో ఆలోచించాలని పలువురు వక్తలు కోరారు. ఈ ఎన్నికలో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య భవిష్యత్తు దృష్ట్యా వ్యక్తిగత నిజాయితీ కలిగిన అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిలబడాలని, తెలంగాణ పౌర సమాజం తరపున పార్లమెంట్ సభ్యులందరికీ లేఖలు సైతం రాస్తామని తీర్మానించారు. విలువలు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఓటువేయాల్సిన తరుణమిదని గుర్తుచేశారు. పార్టీవాళ్లకే ఓటు వేయాలని నిబంధన రాజ్యాంగంలోనూ ఎక్కడా లేదని, కాబట్టి విలువలు గౌరవించే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం తెలుగు బిడ్డ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా, అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు ఎంఎం రహమాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వక్తలు, మేధావులు హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తనకు వ్యక్తిగతంగా చాలా పరిచయం కలిగినవారని ఆయన ప్రజల పక్షాన పనిచేశారని అన్నారు. సల్వాజుడుం అనే ప్రైవేటు సైన్యాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఆదివాసీలను లెక్కలేని విధంగా హత్యచేశారని చెప్పారు. మహిళలను, అక్కడున్న ప్రజలను బట్టలు విప్పించి చెప్పుల దండలు మెడలో వేసి ఊరేగింపు కార్యక్రమాలు సైతం చేశారని, ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ విషయం అవగాహన లేకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం విలువలు దిగజారి మాట్లాడడం బాధాకరమన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత వివరాలు సేకరించి, తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విషయంలో మాత్రం సల్వాజుడుంను ముందుకు తీసుకురావడం విడ్డూరమన్నారు. ఈ ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణ కోసం సాగుతున్నాయని, అందుకే కొద్దిరోజులుగా విలువల మధ్య చర్చ కొనసాగుతోందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలుపోటములు పక్కనబెడితే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించగానే రాజ్యాంగం, విలువల మధ్య చర్చ తారాస్థాయికి చేరిందన్నారు. అందుకే పౌర సమాజంలో అందరూ ఏకమై రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని విలువలను కాపాడుకోవాలని అన్నారు.
ప్రజల హక్కులను కాపాడే బాధ్యత సుప్రీంకోర్టుదే.. : రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్
ఈ దేశ ప్రజల హక్కులను కాపాడేది సుప్రీంకోర్టు మాత్రమేనని రిటైర్డ్ జడ్జి జస్టి చంద్రకుమార్ అన్నారు. ఉన్నత న్యాయస్థానాల తీర్పులు ఈ విధంగా ఉండాలని ఓ రాజకీయ నాయకులు చెప్పగలరా? అలా చెప్పే అర్హత అతనికి ఉందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి భిన్నంగా ఏ ఆర్డినెన్స్ తెచ్చినా, ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే వాటిని కొట్టివేసే హక్కు సుప్రీంకోర్టుకు ఉందని, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత సుప్రీంకోర్టు జడ్జిల మీద ఉందని అన్నారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఏ ఘర్షణ వాతావరణం నెలకొన్నా, ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే బాధ్యత సుప్రీంకోర్టుదేనని చెప్పారు. ఆర్టికల్ 32 ప్రకారం ఏ వ్యక్తి ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా, ఎన్కౌంటర్ జరిగినా జీవించే హక్కు భంగం కలిగినా కాపాడే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉందన్నారు. ప్రభుత్వాలు కూడా కోర్టు ముందర కక్షిధారి అని, ఓ కక్షిదారి కోర్టు తీర్పును తప్పు పట్టడానికి అవకాశం ఉందా.. ఇది అత్యంత దుర్మార్గం అన్నారు. కోర్టు తీర్పుల వల్ల ఎంతో మంది రాజకీయ నాయకులపై గతంలో కేసులు కూడా అయ్యాయని, ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలా అంటే అలా మాట్లాడటం సరైనది కాదన్నారు. రాజ్యాంగంపై గౌరవం ఉన్నవారు ఎవరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయరని, సుదర్శన్ రెడ్డి ఓటు హక్కును అడ్డుకోవడం కోసమే అమిత్ షా ఈ కామెంట్లు చేశారని మండిపడ్డారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పగలరా? చదువు లేనివారికి తుపాకులు ఇచ్చి చంపడం దారుణం కాదా? ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి వారి చేతులకు తుపాకులిచ్చి హత్యలు చేయించడం కరెక్టేనా అంటూ కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. సీబీఐ, ఈడీ కేంద్ర దర్యాప్తుల సంస్థలను చివరికి ఎన్నికల కమిషన్‌ను కూడా బిజెపి ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకొని దేశ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న దుస్థితి నెలకొందన్నారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి జనజీవన స్రవంతిలోనే ఉన్నారు : దేవులపల్లి అమర్, సీనియర్ సంపాదకులు
అర్బన్ నక్సలైట్ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ఘాటైన విమర్శలు చేశారు. ఆయనకు బిజెపి మద్దతు ఇవ్వాలని, గెలుపోటములు తర్వాత విషయమని అన్నారు. అమిత్ షా మాటలతో న్యాయ వ్యవస్థ పరువు పూర్తిగా దిగజార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నక్సలైట్లు ఎప్పుడో ఖతమయ్యేవారని రాజ్యాంగ ద్విసభ్య ధర్మాసనం తీర్పుపై ఈ దేశ హోంమంత్రి విమర్శలు చేయడం దారుణమన్నారు. సుప్రీంకోర్టులో బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన రిటైర్డ్ జడ్జిలకు వెంటనే రాజ్యసభ సభ్యులుగా పదువులు కల్పిస్తున్నారని తెలిపారు. నిజాయితీగల తీర్పు రాజ్యాంగ రక్షణకు సుప్రీంకోర్టు ఉంటుందన్నారు. చత్తీస్‌గడ్‌లో స్పెషల్ పోలీస్ వ్యవస్థను తెచ్చి ఎలాంటి విద్యార్హత లేకుండా వందలాది మందిని హత్య చేశారని, ఆదివాసీ గిరిజన మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టారని అన్నారు. రామచంద్ర గుహ నందిని సుందర్ సుప్రీంకోర్టుకు వెళితే తప్ప ఈ చారిత్రాత్మకమైన తీర్పు వచ్చిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని సమర్థించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
రెండు సిద్ధాంతాల మధ్య పోటీ : కే.రామచంద్ర మూర్తి, సీనియర్ సంపాదకులు
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో రెండు సిద్ధాంతాల మధ్య పోటీత్వత్వం నెలకొందని కె రామచంద్రమూర్తి అన్నారు. భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సోషలిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి అని, ఆయన పనిచేసిన విధానం రాజ్యాంగానికి కంకణబద్ధులై ఉండి దళిత గిరిజన ఆదివాసి ప్రజల హక్కులను కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగ బద్దంగానే తీర్పులు ఇస్తుందని, అమిత్ షా వ్యాఖ్యలు సరైనవి కావాన్నరు. ఎంపీలందరూ అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని, సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
సల్వాజుడుం తీర్పు రాజ్యాంగ బద్ధమైన తీర్పు : సీనియర్ జర్నలిస్టు ఎన్ .వేణుగోపాల్
జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు రాజ్యాంగ బద్ధమైన తీర్పు అని సీనియర్ జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఫాసిజం విధానాలను అవలంబిస్తుందని, సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించగానే సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. అర్బన్ నక్సలైట్‌ను ఓడిరచండి అని మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తే అమిత్ షాకు భయం పట్టుకుందన్నారు. సల్వాజుడుం తీర్పు ఇవ్వకపోతే 20 ఏళ్ల క్రితం నక్సలైట్లు ఖతమయ్యే వారని మీడియాలో ఏవిధంగా మాట్లాడతారని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అనుభవిస్తున్నవారు రాజ్యాంగానికి కంకణ బద్ధులై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఎలా తప్పుబడతారని షా వ్యాఖ్యలపై మండి పడ్డారు. ఎంపీలందరూ ఆరెస్సెస్‌వైపు ఉంటారా? ఆత్మప్రబోధానుసారం ఉంటారా? ఆలోచించుకోవాలి.
చట్టబద్ధమైన అధికారం ఉండాలి : ప్రొఫెసర్ కోదండరాం
ఆనాడు సల్వాజుడుం పేరిట అమానవీయ ఘటనకు పాల్పడ్డారని, అందుకే రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రస్తుతం సాంప్రదాయం పునాదుల మీద, బలప్రయోగం ఆధారంగా అధికారం చెలాబడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ రెండు అధికారాలకు సమాజం పట్ల బాధ్యత ఉండదన్నారు. ఇలాంటి బాధ్యతను గుండాయిజంతో నాడే అంబేద్కర్ పోల్చారని చెప్పారు. చట్టబద్దమైన అధికారం నిలబడాలని, అప్పుడే జవాబుదారీతనం ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విషయంలో ఘర్షణ ఏర్పడుతున్నప్పుడు మనం ఎటువైపో తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ విలువల ప్రకారం అధికారం నడవాలని కోరుకునేవారు కచ్చితంగా ఒకవైపు నిలబడాలన్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో సుదర్శన్ రెడ్డివైపు సమాజం నిలబడాలని కోరారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ డీఎల్, పాశం యాదగిరి, బీఎస్ రాములు, సయ్యద్ రఫీ, రాఘవాచారి, విరహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.