తెలంగాణ రాష్ట్రంలో వైద్య విప్లవం

` ప్రతి జిల్లాకో మెడికల్‌ కళాశాల శుభపరిణామం:మంత్రి హరీశ్‌రావు
ములుగు(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించింది ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ములుగు జిల్లాలో మెడికల్‌ కాలేజీ, డిగ్రీ కాలేజ్‌, 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు ప్రసంగించారు. ములుగులో మెడికల్‌ కాలేజీ కోసం శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ములుగు జడ్పీ చైర్మన్‌ జగదీశ్‌ బతికి ఉంటే మెడికల్‌ కాలేజీ రావడం చూసి సంతోష పడేవారని మంత్రి పేర్కొన్నారు. కేసీఅర్‌ లేకుంటే ములుగు జిల్లా అయ్యేదా..? మెడికల్‌ కాలేజీ వచ్చేదా..? అని అడిగారు. కేసీఆర్‌ వల్లే కొత్త జిల్లా, కొత్త మెడికల్‌ కాలేజీ సాధ్యమైందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం అమలుకు స్ఫూర్తి ఈ ములుగు జిల్లానే అని హరీశ్‌రావు గుర్తు చేశారు. గుత్తూరు తండాలో 12 ఇండ్లు కాలిపోయాయి. బిడ్డకు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఆ తండ్రి ఉంటే, ఆ పరిస్థితి చూసి కేసీఆర్‌ చలించి పోయారు. ఆ పెళ్లికి అండగా నిలబడి కేసీఆర్‌ ఆర్థిక సాయం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి ప్రారంబించారు. కులం లేదు.. మతం లేదు.. పార్టీ లేదు.. 12 లక్షల మంది అర్హులకు, రూ. 11 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. పోడు భూముల విషయంలో 4 లక్షల 6 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ములుగు జిల్లాలోనే 14 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చామని చెప్పారు. అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ ఇలా రైతులకు ఎన్నో చేశారు. ఉన్న కేసులు ఎత్తివేశారు. నాడు ఎన్‌కౌంటర్లు, రైతు చావులు, ఎరువుల కొరత, కరెంట్‌ కొరత ఉండేది. కేసీఆర్‌ నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. నేడు ఇంటింటికీ తెలంగాణ ప్రభుత్వం పథకాలు చేరువ అయ్యాయని హరీశ్‌రావు తెలిపారు. అతి ఎక్కువ ప్రభుత్వ డెలివరీలు ఉన్న రెండో జిల్లాగా ములుగు నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. మొదటిది నారాయణ్‌ ఖేడ్‌ అని తెలిపారు. 83 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగటం సంతోషం. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వరద సమయంలో ఏటూరు నాగారంలో డయాలసిస్‌ సెంటర్‌ పెట్టామని చెప్పారు. నాడు ములుగులో డాక్టర్‌ ఉండటం గొప్ప, నేడు డాక్టర్లను తయారు చేసే మెడికల్‌ కాలేజీ ఇచ్చింది కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ములుగు దవాఖానలో దాదాపు వంద మంది వైద్యులు ఉంటారని తెలిపారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల.. నీట్‌లో 2లక్షల ర్యాంకు వచ్చినా ఎంబీబీఎస్‌ సీటు వచ్చిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.