‘తెలంగాణ వాదులను రెచ్చగొట్టడమే వారి పని’

హైదరాబాద్‌, జనంసాక్షి: విజయవాడ కాంగ్రెస్‌ లగడపాటి రాజ్‌ గోపాల్‌, మంత్రి టీజీ వెంకటేష్‌, పరకాల ప్రభాకర్‌ పై ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టడం వారికి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద దిలీప్‌ కుమార్‌ విలేకర్లతో మాట్లాడుతూ పరకాల ప్రభాకర్‌కు ప్రెస్‌క్లబ్‌ లో పుస్తకావిష్కరణకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన దాడిలో గాయపడి జర్నలిస్టులకు ఆయన సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి కృషి చేసిన వారికి వచ్చే ఎన్నికల్లో పోటి చేసి గెలిపించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా దిలీప్‌ కుమార్‌ జేఏసీకి సూచించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలతో మమేకమవటం… అలాగే ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కే వైపు మొగ్గు చూపటం జేఏసీకి అలవాటుగా మారిందన్నారు. అయితే జేఏసీ ఆ పంధాను విడనాడి అన్ని పార్టీలను సమానంగా చూడాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ ఆమోదించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన దుయ్యబట్టారు.