తెలంగాణ విమోచనను గోల్కొండలోనే నిర్వహించాలి: బిజెపి

హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): గోల్కొండ కోటలో జెండా ఎగుర వేసినట్లుగానే సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన సందర్బంగా జాతీయ జెండాను అక్కడే ఎగురవేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామగ్రామాన జాతీయ జెండాలను ఎగురవేయాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. తెరాస పాలనతో సామాన్యుడు అన్ని విధాలా నష్టపోయాడని, స్వలాభాపేఖతో పాలన సాగిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి రాగానే గారడీ మాటలతో అన్ని వర్గాల ప్రజలను మోసగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హావిూల అమలులో విఫలమయిందన్నారు. రైతులకు రుణమాఫీ విడతలుగా ఇచ్చి మోసగించడంతో పాటు ఇంటికో ఉద్యోగం, లక్ష ఎకరాలకు సాగునీరు, ఎస్సీలకు మూడెకరాల భూమి, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్టచివరి వరకు సామాన్యుడికి అందించే లక్ష్యంతో ప్రధాన మోదీ కృషి చేస్తున్నారన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ నాయకత్వాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని, విసృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు.

—-