తేజస్వీయాదవ్‌కు సుప్రీం షాక్‌

బంగ్లా ఖాళీ చేయనందుకు 50వేల జరిమానా
న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  పాట్నాలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని అక్కడి కోర్టు ఇచ్చిన
తీర్పును సవాలు చేస్తూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయో తో కూడిన ధర్మాసనం.. బంగ్లా ఖాళీ చేయనందున మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వికి 50 వేల రూపాయల జరిమానా విధించింది. 2015లో బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వికి పాట్నాలోని దేశరత్న మార్గ్‌లోని ప్రభుత్వ బంగ్లాను కేటాయించింది. అనంతరం జెడియు-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంరతం సుశీల్‌ కుమార్‌ మోడీకి ఆ బంగ్లాను కేటాయించామని, బంగ్లా ఖాళీ చేయాలని తేజస్విని ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తేజస్వి ఆ బంగ్లా ఖాళీ చేయడానికి తిరస్కరించారు. తనను బంగ్లా ఖాళీ చేయించాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ పాట్నా కోర్టు ఆశ్రయించగా పిటిషన్‌ను తోసిపుచ్చింది.