తొలి పరుగే ఆలస్యమైంది!
– గంటపాటు ఆలస్యంగా గమ్యాన్ని చేరిన ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’
న్యూఢిల్లీ, ఫిబ్రవరి18(జనంసాక్షి) : దేశీయంగా తయారైన తొలి సెవిూ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ 18) తొలి పరుగు గంటన్నర ఆలస్యమైంది. ఆదివారం తొలిసారి కమర్షియల్‌గా ప్రయాణం ప్రారంభించిన ఈ రైలు పొగమంచు కారణంగా గంటన్నర ఆలస్యంగా గమ్యానికి చేరుకుంది. ఢిల్లీ నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు వారణాసి కంటోన్మెంట్ స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉండగా, గంటన్నర ఆలస్యంగా 3.25 గంటలకు చేరుకుంది. తిరుగు ప్రయాణంలోనూ ఆలస్యం కొనసాగింది. 1:48 గంటలు ఆలస్యంగా ఢిల్లీకి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. జియాబాద్-తుండ్లా సెక్షన్‌లో దట్టమైన పొగమంచు కారణంగా రైలు ఆలస్యంగా నడిచినట్టు అధికారులు
పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత, క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైలు వేగాన్ని 60 కిలోవిూటర్లకు తగ్గించినట్టు వివరించారు. వాతావరణ పరిస్థితులే రైలు ఆలస్యానికి కారణమని, ఈ కాలంలో పొగమంచు సహజమేనని ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ విూడియాకు వెల్లడించారు. పొగమంచు తగ్గిన తర్వాత రైలును తిరిగి 130 కిలోవిూటర్ల వేగంతో నడిపినట్టు తెలిపారు. కాగా, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య ఆదరణ లభించిందని, తొలిరోజు ప్రయాణికులతో నిండిపోయిన ఈ రైలులో మరో రెండు వారాల వరకు టికెట్లు లేవని స్వయంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.