త్యాగరాయ గానసభలో మరో ఆడిటోరియం

ప్రారంభించిన మాజీ ఐఎఎస్‌ అధికారి కెవి రమణ
హైదరాబాద్‌,ఆగస్ట్‌29(జనంసాక్షి): దశాబ్దాల ఘన సాంస్కృతిక, సాహిత్య చరిత్రతో ఎందరో కళాకారులు, సాహిత్యకారుల వైభవానికి కళామతల్లిగా ఆశీర్వదించిన శ్రీ త్యాగరాయ గానసభలో మరో ఆడిటోరియం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ అనేక సంగీత ఉత్సవాలకు, ఉచిత సంగీత, నాట్య తరగతులకు
నూతనంగా ఏడో ఆడిటోరియాన్ని ప్రారంభించడం శుభపరిణామమని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కేవీ.రమణాచారి అన్నారు. హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో నూతనంగా ఏర్పాటైన సంగీత నాట్య కళా వేదికను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రముఖ రచయిత, ఆంధ్ర ప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ’ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సంగీత, నాట్య రంగాలలో కొత్త తరాల శిక్షణకోసం శ్రమించి, పరిశ్రమించి మరీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు జనార్ధన మూర్తి ఇంత వైభవాన్ని మిత్రుల సహకారంతో నిర్మించడం ఏడు కొండలవాడి దయేనని అభినందించారు.కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యులు, త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు శంకరనారాయణ, త్యాగరాయగాన సభ కమిటీ సభ్యులు చక్రపాణి ప్రసాద్‌, పద్మజ నీలిమ, గీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాలకు సహజంగా దూరంగా వుండే పురాణపండ శ్రీనివాస్‌ ఈ చక్కని కార్యక్రమానికి హాజరవ్వడంతో పలువురు సాహితీ, సాంసృతిక రంగాల ప్రముఖులు ఆప్యాయంగా పలకరించడం విశేషం.