త్యాగాల తెలంగాణతో కెసిఆర్‌ అధికార దర్పం

హావిూలు నెరవేర్చకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో మోసం: గండ్ర
వరంగల్‌,మే4(జ‌నం సాక్షి): ఎందరో యువత త్యాగాలు, సోనియాగాంధీ  నిర్ణయంతోనే తెలంగాణ వచ్చినా కేసీఆర్‌  పాలనలో ప్రజలు కోరుకొన్న తెలంగాణ కనిపించడం లేదని మాజీ చీఫ్‌విప్‌, కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కేవలం ప్రజలకు సమాధానం చెప్పలేకనే ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదాన్ని తెరపైకి  కేసీఆర్‌ తెచ్చారని అన్నారు. ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంతోనే పోరాటం సాగినా ఆలక్ష్యాలు కనుమరుగు అయ్యాయని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన దళిత, గిరిజనులకు మూడెకరాల భూ పంపిణీ, రిజర్వేషన్ల పెంపు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు హావిూగానే మిగిలిపోయాయని విమర్శించారు. హావిూలను పక్కన పెట్టి  ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉన్న సమస్యలను తీర్చలేని నేత దేశ సమస్యలను పరిస్కరిస్తానని అంటే ఎవరైనా నమ్ముతారనా అని అన్నారు.  తెలంగాణలో ఆయన ఇచ్చిన హావిూలో ఏమి నెరవేర్చారని దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారని ప్రశ్నించారు. హావిూలు మరిచిపోవడమే గుణాత్మక మార్పా? అని ప్రశ్నించారు.  మతంపేరుతో దేశాన్ని విడగొట్టాలని చూస్తున్న భాజపాను ఆపాలంటే లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.  కేసీఆర్‌  ఎన్ని ప్రయత్నాలు చేసిన  రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రాజెక్టుల గురించి గొప్పలు చెప్పుకుంటున్న తెరాస, కృష్ణా, గోదావరిపై ఏ ఒక్క ప్రాజెక్టును నిర్మించి నీళ్లు అందించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతోనే ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటుందని చెబుతున్న కేసీఆర్‌.. నిజంగా అలా జరుగుతుంటే.. ఆయనేం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడినపుడు మిగులు బడ్జెట్‌ ఉందని చెప్పిన సీఎం  అప్పటి వరకు రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేశానని చెబుతున్నారని, వాటితో ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని డిమాండ్‌ చేశారు.