త్వరలో పగటిపూట కరెంట్: కడియం
వరంగల్,మార్చి26 (జనంసాక్షి) : రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.విద్యుత్ సమస్య తీర్చిందని ఇకుముందు పగటిపూట కరెంట్ కూడా ఇవ్వబోతున్నామని అన్నారు. కెసిఆర్ సమర్థ నాయకత్వం కారణంగానే విద్యుత్ సమస్యను అధిగమించామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 38 లక్షల మంది రైతులకు 4,250 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడమే కాకుండా 12 వేల కోట్ల రూపాయల రుణాలకు రీ షెడ్యూల్ చేసిందని, ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో నీటిని నిల్వ చేసుకునేందుకు 26 వేల కోట్ల రూపాయలతో 46 వేల చెరువులను పునరుద్దరించడం జరుగుతుందని అన్నారు. మొదటి విడుతగా 2 వేల కోట్లతో 9 వేల చెరువులు మరమ్మతులు జరగడంతో పాటు రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో అన్ని చెరువులకు కలిపి సుమారు 2500 టీఎంసీల నీటి సామర్థ్యం పెంచడం జరుగుతుందని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 250 కోట్ల రూపాయలతో గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు వేయి ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని అన్నారు. తెలంగాణలో ఉన్న భూములు ఎంతో నాణ్యమైనవి, ఇక్కడ ఉన్న భూములు ఎక్కడా లేవని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీటి వినియోగం తగ్గించుకునేందుకు 250 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించిందని, మత్య్స కారులకు ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేయడంతో పాటు రైతులు వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రవేత్తల సూచనలు పాటించి ఆరుతడి పంటలైన మొక్కొజన్న, కందులు, పెసరు, మినుములు వేసుకొని అధిక లాభాలు పొందాలని అన్నారు. చెరువుల పునరుద్దరణ జరిగితే గ్రామాల్లో మళ్లీ జలకళ వస్తుందన్నారు. చెరువు మట్టితో పొలాలను పటిష్టం చేసుకోవాలని మంత్రి సూచించారు.