దక్షిణ కొరియాలో పాస్టర్ ఘాతుకం
దేవుడి పేరుతో మహిళలపై అత్యాచారం
రెండు దశాబ్దాలుగా అమాయక స్త్రీలపై వల
15ఏళ్ల ఖైదు విధించిన కోర్టు
టోక్యో,నవంబర్22(జనంసాక్షి): ఇది మరో డేరా బాబా కథ. కాకపోతే సౌత్ కొరియాలో జరిగింది. తనకు తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే ఓ పాస్టర్ తన అనుచరులైన 8 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. అంతేనా అంటే ఇది దేవుడి ఆదేశాల మేరకే చేశానని చెప్పుకున్నాడు. తనపై నమ్మకం ఉంచి వచ్చిన మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసులో అక్కడి కోర్టు అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పైగా తాను చేసిన ఈ పాపానికి జేరాక్ లీ అనే ఆ పాస్టర్ దేవుడి పేరు చెబుతున్నారు. దేవుని ఆదేశాల మేరకే ఈ పని చేస్తున్నట్లు సదరు మహిళలకు లీ చెప్పేవాడు. రెండు దశాబ్దాలుగా లీ ఇలా తన మహిళా అనుచరులపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అతడు సాధారణ వ్యక్తి కాదు. మాన్‌మిన్ సెంట్రల్ చర్చ్ చీఫ్. ప్రపంచవ్యాప్తంగా దీనికి పది వేల చర్చ్‌లున్నాయి. లక్షా 33 వేల మంది అనుచరులు ఉన్నారు. అలాంటి చర్చి వ్యవహారాలు చూసే జేరాక్ లీ ఈ దారుణానికి పాల్పడటం చాలా మందిని షాక్‌కు గురి చేసింది. మొదటి నుంచీ లీది వివాదాస్పద జీవితమే 1999లోనే క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ కొరియా నుంచి తొలగించారు. లీ అత్యాచారం చేసిన మహిళలు చిన్నప్పటి నుంచీ అదే చర్చికి వెళ్తున్నారు. అతన్నో దేవుడిగా వాళ్లు ఆరాధిస్తున్నారు. లీ చెప్పిన ఏ విషయాన్నీ కాదనే ధైర్యం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వాళ్లు చేరుకున్నారు. ఇదే వాళ్లపై అత్యాచారం చేయడానికి జేరాక్ లీకి అవకాశం కల్పించింది. అయితే కోర్టు విచారణలోనూ ఈ పనికి తాను పశ్చాత్తాప పడటం లేదని 75 ఏళ్ల లీ చెప్పడం విశేషం. బాధితురాళ్ల కంటే వయసులోనూ 50 ఏళ్ల పెద్దవాడు. లీ తమతో అసభ్యంగా ప్రవర్తించినా సరే అది తమ పాపాలను కడిగేసే చర్యగా వాళ్లు భావించారే తప్ప లైంగిక దాడిగా బాధితురాళ్లు చూడలేదని విచారణ సందర్భంగా కోర్టు చెప్పింది.