దడపుట్టిస్తున్న పెట్రో ధరలు

మరోమారు పెరిగిన రేట్లు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): పెట్రో షధరలు మంటపుట్టిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్రవారం జీవనకాల గరిష్ఠానికి చేరిన డీజిల్‌.. శనివారం మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరింది. అటు పెట్రోల్‌ ధరలు కూడా నేడు జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి.ఇండియన్‌ ఆయిల్‌ ధరల ప్రకారం.. దేశ రాజధానిలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర 16 పైసలు పెరిగి రూ. 78.68గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర 21 పైసలు పెరిగి రూ. 70.42గా ఉంది. లీటర్‌ పెట్రోల్‌ ధర ముంబయిలో రూ. 86.09, కోల్‌కతాలో రూ. 81.60, చెన్నైలోని 81.72గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర ముంబయిలో రూ. 74.76, కోల్‌కతాలో రూ. 73.27, చెన్నైలో రూ. 74.39గా ఉంది. ఈ ఏడాది మే నెలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. మే 29న దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 78.43గా ఉంది. తాజా పెంపుతో ఆ రికార్డును దాటి పెట్రోల్‌ ధర జీవనకాల గరిష్ఠానికి చేరింది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగ వచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గృహ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి.