దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న మోడీ

బడాబాబులకు వేలకోట్లు మాఫీ

రైతులకు విదిల్చింది మాత్రం కొంతే: స్టాలిన్‌

చెన్నై,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేపట్టిన దీక్షకు డీఎంకే మద్దతు తెలిపింది. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, రాష్ట్రాలల్ర హక్కులను కాలరాసే ప్రయత్నాల్లో భాగమే ఇవన్నీ అంటూ వివిధ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం… స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. తనపై జరుగుతున్న కక్షసాధింపు చర్యలపై మమతా బెనర్జీ పోరాడుతున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడుతున్నారని తెలిపారు. ఆమెకు తమ మద్దతు

ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలావుంటే బడా ధనవంతులకు రూ.వేల కోట్ల రుణ మాఫీ చేసే కేందప్రభుత్వం… రైతులు తీసుకున్న చిన్న మొత్తాలను మాత్రం మాఫీ చేయకపోవడమేంటని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ధ్వజమెత్తారు. మదురై జిల్లా తిరుప్పరకుండ్రం సవిూపంలోని తణకన్కుళం పంచాయతీలో డీఎంకే తరఫున గ్రామసభ జరిగింది. ఇందులో స్టాలిన్‌ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోదీని ఉత్తముడని చెప్పాల్సి వస్తే ముఖ్యమంత్రి పళనిస్వామి ఆయన కన్నా ఉత్తమోత్తముడని ఎద్దేవా చేశారు. వారిని ఉత్తములని చెబితే ప్రజలు ఆమోదించరని, అందుకే తాను చెప్పిన వెంటనే పలువురు ఫక్కున నవ్వారంటూ తెలిపారు. ఆ మేరకు వారిద్దరూ దారుణమైన పరిపాలన అందిస్తున్నారని ఆరోపించారు. అబద్దాలతోనే మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. మళ్లీ ఇప్పుడు అబద్దాలతో బ్జడెట్‌ను వండివర్చారని ధ్వజమెత్తారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానంటూ కొత్తగా ఓ కథ చెప్పారని, అయితే ఈ పాలకులు రైతుల కౌపీనాన్ని లాగి తరిమివేశారనే విషయం అందరికీ గుర్తుంటుందని తెలిపారు. రైతుల రుణాలు మాఫీ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనీ మోదీ తెలిపారని పేర్కొన్నారు. రైతుల రుణాలు గరిష్ఠంగా రూ.లక్ష వరకు ఉంటాయని, వాటిని మాఫీ చేయననే మోదీ రూ.కోట్లను కొల్లగొట్టిన బడా ధనవంతులకు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు రుణ మాఫీ చేశారంటూ ధ్వజమెత్తారు. దేశం ప్రస్తుతం శ్మశానంగా మారే పరిస్థితిలో ఉందని, అలాంటి దురదృష్టకరమైన పాలన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం కరప్షన్‌, కలెక్షన్‌, కమిషన్‌ నినాదంతో మాత్రమే పనిచేస్తోందని ధ్వజమెత్తారు.