దళితబస్తీకి కరెంట్‌ షాక్‌

మరుగుదోడ్లు నిర్మించుకోకపోవడంతో కట్‌
జనగామ,మే30(జ‌నం సాక్షి): మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే కరెంట్‌ కట్‌ చేస్తారా? మాతో పరిహాసమా అంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే 12వేలతో మరుగదొడ్డి కట్టుకోలేక పోతున్నామని చెప్పినా కరెంట్‌ కట్‌ చేస్తే బతికేదెలా అని వాపోయారు. అయితే కావాలని అధికారులు పదే పదే చెప్పినా వినకపోడంతో ఆగ్రహించిన మండల పరిషత్‌ అధికారులు నిడిగొండ గ్రామలోని దళిత కాలనీకి చెందిన 20 మంది గృహాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపి వేశారు. ఎంపీడీవో హాషీం స్థానిక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆగయ్య ఆదేశాల మేరకు స్థానిక విద్యుత్‌ సిబ్బంది ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రూ. 12 వేలతో మరుగుదొడ్డి నిర్మించుకుంటే అది ఎంతో కాలం ఉండడం లేదని, పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం రూ. 25 వేలు ఖర్చు అవుతుందని వారు తెలిపారు. అంత మొత్తం తమ వద్ద లేకపోవడంతో మరుగుడొడ్డి నిర్మాణానికి ముందుకుకు రావడం లేదని వాపోయారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అవసరమేనని అంత మాత్రాన ఇళ్లకు ఉన్న కరెంట్‌ కనెక్షన్‌ను తొలగించడం సరికాదన్నారు. అసలే వేసవి కాలం కావడంతో కరెంట్‌ లేక చీకట్లో పాములు, తేళ్లతో ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. వెంటనే తమ కరెంట్‌ పునరుద్దరించాలన్నారు.