దిగొచ్చిన బంగారం

దిల్లీ: పసిడి పరుగులకు అడ్డుకట్ట పడింది. వరుసగా నాలుగు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర అంతర్జాతీయ బలహీన సంకేతాలతో శనివారం కాస్త దిగొచ్చింది. దీనికి తోడు స్థానిక నగల వ్యాపారుల నుంచి కూడా డిమాండ్‌ తగ్గిపోవడంతో పుత్తడి ధర రూ.105 తగ్గింది. దీంతో నేటి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.32,370గా ఉంది.

ఇక వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో కిలో రూ.350 తగ్గింది. దీంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 41,200లకు పడిపోయింది. అంతర్జాతీయంగానూ ఈ లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. న్యూయార్క్‌లో శుక్రవారం నాటి మార్కెట్లో బంగారం ధర 0.22శాతం తగ్గి ఔన్సు పసిడి 1,301.20 డాలర్లు పలికింది. వెండి కూడా 0.99శాతం తగ్గి ఔన్సు ధర 16.47డాలర్లుగా ఉంది.