దినకరన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

– దినకరన్‌కు ‘ప్రెషర్‌ కుక్కర్‌’ కేటాయించలేం

– పార్టీ గుర్తుపై స్పష్టం చేసిన సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : టీటీవీ దినకరన్‌ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీకి ఇప్పుడు ‘ప్రెషర్‌ కుక్కర్‌’ గుర్తును మంజూరు చేయడం కుదరదని సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. దినకరన్‌ నేతృత్వంలోని పార్టీకి కామన్‌గా ఒక గుర్తు, పేరు కేటాయించాలంటూ గతేడాది మార్చి 9న ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ‘ప్రెషర్‌ కుక్కర్‌’ కేటాయించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోర్టు సూచించింది. దీనిపై సీఎం పళనిస్వామి వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఏఎం ఖన్వీల్కర్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తమిళనాడు అసెంబ్లీలో ఖాళీ అయిన 18 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నాలుగు వారాల్లోగా ఈసీ నోటిఫికేషన్‌ ఇవ్వగలిగితే.. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి ఎన్నికల సంఘం ఏఎంఎంకే పార్టీకి ప్రెషర్‌ కుక్కర్‌ గుర్తును కేటాయించాలని తెలిపింది. లేనిపక్షంలో ఏఎంఎంకే పార్టీకి ఈసీ తన ఇష్టానుసారం ఎన్నికల గుర్తును కేటాయించవచ్చునని ధర్మాసనం స్పష్టం చేసింది.