దివంగత పివికి మరోమారు అవమానం

భారతరత్నగా గుర్తించని మోడీ ప్రభుత్వం

దేశానికి దశాదిశా చూపిన మేధావికి అడుగడుగునా అవమానాలే

న్యూఢిల్లీ,జనవరి26(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో సమున్నత శిఖరాలను అధిష్టించి, దేశానికి దశదిశను చూపిన, అపర చాణుక్యుడు దివంగత ప్రధాని పివి నరసింహారావును మోడీ ప్రభుత్వం మరోమారు విస్మరించింది. రాజకీయాల్లో ఆయనను విస్మరించారనడానికి తాజా భారతరత్న పురస్కారాలే నిదర్శనం. నిజానికి అంతకు మించి గౌరవం ఆయన పొందారు. బతికుండాగానే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఆయనను అవమానించింది. మరణం తరవాత కూడా అవమానించింది. పివి గురించి పదేపదే ప్రస్తావించిన ప్రస్తుత ప్రధాని మోడీ కూడా పివికి భారతరత్న ప్రకటించి ఉంటే ఆయన గౌరవం ఇనుమడించేది. కానీ రాజకీయాల కోసం మాత్రమే పివిని పక్కన పెట్టిన తీరు బాధించక మానదు. దివంతగ ప్రధాని వాజ్‌పేయ్‌ అద్భుత ప్రతిభాపాటవాలను గుర్తించిన మహామనీషి పివి. వాజ్‌పేయ్‌ ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేలా చేశారు. పివి ప్రధాని అయిన తరవాతనే కుదేలయిన దేశ అర్థిక రంగం నిలబడింది. ఆయన ద్వారానే మన్మోహన్‌ సింగ్‌, ప్రణబ్‌ ముఖర్జీలు వెలుగులోకి వచ్చిన విషయాన్ని కాదనలేం. అలాంటి మ¬న్నత వ్యక్తికి భారతరత్న ప్రకటించకపోవడం ద్వారా మోడీ సర్కార్‌ తనను తాను అవమానించుకుందే తప్ప, పివికి వచ్చిన అవమానమేదీ లేదు. ఇవాళ భారతదేశం సంస్కరణల పథంలో ముందుకు సాగడం అన్నది పివి భిక్ష అని చెప్పుకుంటున్న మనం ఆయనను అవమానించడం ద్వారా సాధించేదేవిూ లేదు. ఎన్నికల వేళ పివిని పక్కన పెట్టి ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న ఇవ్వడం కేవలం రాజకీయ నిర్ణయం కాక మరోటి కాదు. మోడీ ప్రభుత్వం ఇక్కడా విశాల దృక్పథం అవలంబించలేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఉండబోదు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అత్యంత అరుదైన రాజకీయవేత్తగా దేశానికి సేవలందించారు. దీనిని ఎవరూ కాదనలేరు. కానీ పివికి భారతరత్న ఇవ్వకుండా చేయడమన్నదే దేశ ప్రజలను బాధించే విషయం. సచిన్‌ టెండుల్కర్‌కన్నా పివిని తక్కువ చేయడమే జీర్ణించుకోలేని వ్యవహారం. దాదా పిలుచుకునే ప్రణబ్‌ ముఖర్జీ పార్లమెంటరీ వ్యవస్థను ఔపోసన పట్టిన అపరచాణుక్యుడు. దేశ రాజకీయాల్లో ఉత్తానపథనాలను ప్రత్యక్షంగా చూసిన మహామేధావి ప్రణబ్‌. ఏ అంశంవిూదైనా అనర్గళంగా ప్రసంగించగల వాచస్పతి. మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించడమే కాదు.. తెర వెనక మంత్రాంగం నెరపడంలోనూ ప్రణబ్‌ సిద్ధహస్తుడు. సంక్షోభ సమయాల్లో చిక్కుముడులను అవలీలగా విప్పే నేర్పరి. చాణక్యం, హాస్య చాతుర్యం, గాంభీర్యం, ఆగ్రహం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలిసిన ప్రణబ్‌ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించడం ఆయన గౌరవాన్ని ఇనుమడింపచేసేదే. మన్మోహన్‌సింగ్‌, ప్రణబ్‌ముఖర్జీలు ఒకరు చేపట్టిన పదవిని మరొకరు తర్వాతి కాలంలో చేపట్టడం విశేషం. 1985-87 మధ్య ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా మన్మోహన్‌ పని చేయగా 1991-96లో ఆ బాధ్యతలను ప్రణబ్‌ నిర్వర్తించారు. ఏఐసీసీ ఆర్థికసలహామండలి ఛైర్మన్‌గా 1987-89 మధ్య ప్రణబ్‌ వ్యవహరించగా 1999-2004 మధ్య మన్మోహన్‌ ఆ బాధ్యతలు చూశారు. నిజానికి మన్మోహన్‌కన్నా సీనియర్‌ అయిన ప్రణబ్‌ ప్రధాని పదవిని ఎప్పుడో చేపట్టాల్సింది. కానీ సోనియా రాజకీయాల వల్ల ప్రణబ్‌ ప్రధాని కాలేకపోయారు. ఆయన ప్రధాని అయివుంటే యూపిఎ పనితీరు మరోలా ఉండేది. 47 సంవత్సరాల వయస్సులో తొలిసారి పెద్ద శాఖ అయిన ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టి, ఆర్థికశాఖను పిన్న వయస్సులో చేపట్టిన మంత్రిగా పేరుపొందారు. 1984లో యూరోమని మేగజీన్‌ నిర్వహించిన ఓ సర్వేలో ప్రణబ్‌.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా ఎంపికయ్యారు. ప్రణబ్‌ కార్యదక్షత దేశీయ వ్యవహారాలకే పరిమితం కాదు. అణుఒప్పందం వ్యవహారంలో అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా అమెరికా అధ్యక్షుడితో మంతనాలు నెరిపిన సమర్థత ఆయనది. ఆయన సమర్థతను గుర్తించే దివంగత ప్రధాని పివి మళ్లీ ప్రణబ్‌ను తెరపైకి తెచ్చారు. తన మంత్రివర్గంలో చోటిచ్చారు. మన్మోహన్‌కు ఆర్థిక శాఖ కేటాయించారు. పార్టీలోనూ, పార్లమెంట్‌ వ్యవహారాల్లోనూ సంక్షోభాలు తలెత్తినప్పుడల్లా ఇందిర మొదలు రాజీవ్‌ వరకు పివి అండగా నిలబడ్డారు. అలాగే కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ప్రణబ్‌ముఖర్జీ అండగా ఉంటున్నారు. రాజీవ్‌ మరణానంతరం అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి.. చివరి శ్వాస వరకూ ఆ పదవిలో కొనసాగాలన్న పట్టుదలతో ఉన్నప్పుడు ఆయన్ను తప్పించే బాధ్యత సోనియా.. ప్రణబ్‌కే అప్పగించారు. 1988 మార్చి 14న ప్రణబ్‌ తన నివాసంలో చాణక్యం ప్రదర్శించి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఏడాది సోనియా విదేశీయత అంశాన్ని లేవనెత్తిన శరద్‌పవార్‌, తారిఖ్‌ అన్వర్‌, పి.ఎ.సంగ్మాలను ఎదుర్కొనే బాధ్యతను మళ్లీ ప్రణబ్‌కే అప్పగించారు. ఈ పనినీ సమర్థంగా నిర్వర్తించారు. ఆ సమయంలో సోనియా లేఖలను రూపొందించింది ప్రణబ్‌ముఖర్జీయే అని చెబుతారు. విపక్షాల నిరసనలతో పార్లమెంట్‌ కార్యకలాపాలు స్తంభించినప్పుడు ఎన్నోసార్లు వారితో మాట్లాడి రాజీకి ఒప్పించిన నేర్పరి. తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే వంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలతో తలనొప్పులు వచ్చినప్పుడూ ఆయనే మధ్యవర్తి. 2004, 2009 ప్రత్యక్ష ఎన్నికల్లో తప్పించి ప్రణబ్‌ ఎప్పుడూ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. అయినా ఇందిరాగాంధీ ఆయనకు ఎన్నో కీలకబాధ్యతలు అప్పచెప్పారు. తన గైర్హాజరులో మంత్రివర్గ సమావేశాలకు మిగిలిన వారి కంటే జూనియర్‌ అయిన ప్రణబ్‌కే అధ్యక్షత వహించే అవకాశం కల్పించేవారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన పరిణామాలు రాజీవ్‌గాంధీకి ప్రణబ్‌ను దూరం చేశాయి. ఇందిర హత్య సమయంలో రాజీవ్‌, ప్రణబ్‌ బెంగాల్లో ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరవుతారు అని రాజీవ్‌..ప్రణబ్‌ను అడిగితే అత్యంత సీనియర్‌ మంత్రి ఆ బాధ్యతలు చేపడతారని, నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణానంతరం అదే జరిగిందని ప్రణబ్‌ అన్నట్లు చెబుతారు. అప్పటికి ప్రణబ్‌ముఖర్జీయే సీనియర్‌ మంత్రి. ఇది రాజీవ్‌ ఆగ్రహానికి కారణమయిందని చెబుతారు. తర్వాత కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా ప్రణబ్‌ ¬దాను తగ్గిస్తూ ఆయన్ను బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడిగా రాజీవ్‌ నియమించడంతో కినుక వహించి 1986లో రాష్టీయ్ర సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ను స్థాపించారు. రాజీవ్‌ ఆయన్ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించారు కూడా. 1987లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పేరుపై పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత కూడా మునపటి ప్రాధాన్యం లభించలేదు. పీవీ నరసింహారావు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాతే మళ్లీ ప్రణబ్‌కు పూర్వవైభవం సాధ్యమయింది. రాజీవ్‌ దుర్మరణంతో పీవీ నరసింహారావు కాంగ్రెస్‌ నాయకత్వం చేపట్టి ప్రధాని అయ్యారు. వాస్తవానికి పీవీ కంటే ప్రణబ్‌ ముఖర్జీయే సీనియర్‌. అయితే అంతకు ముందు పార్టీ వీడి మళ్లీ చేరడంతో సాంకేతికంగా కొత్త నేత అయ్యారు. దీంతో ప్రధాని పదవి చేపట్టడానికి పార్టీపరంగా అనర్హులయ్యారు. సోనియా కోటరీలో.. సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావడానికి అంగీకరించిన తర్వాత ప్రణబ్‌ ఆమె కోటరీలో కీలక వ్యక్తిగా అవతరించారు. కఠిన సమయాల్లో సముచిత సలహాలిస్తూ అధిష్ఠానానికి విధేయుడిగా మెలిగారు. దాదాగా సుపరిచితుడైన ప్రణబ్‌ను సన్నిహితులు ముద్దుగా పిలుచుకునే పేరు పొల్తు. రోజూ డైరీ రాస్తారు. ఎంత తీరిక లేకున్నప్పటికీ రోజూ ఒక పేజీ అయినా రాయడం అలవాటు. ఈ డైరీని పుస్తకంగా తీసుకురావాలని కుమార్తె భావిస్తున్నారు. తన జీవితకాలంలో వద్దని ప్రణబ్‌ స్పష్టం చేశారు. దాదాపు 17 ఏళ్లు స్వగ్రామంలోని పూర్వికుల ఇంటిలోనే ఉన్న ప్రణబ్‌కు స్వగ్రామం, ఆ ఇల్లు అంటే ఎంతో మమకారం. ఇప్పటికీ ఆయన తనను పల్లెటూరి అబ్బాయి అనిపించుకోవడానికే ఇష్టపడతారు. ఆయన పుట్టి పెరిగిన ఊరు దేశం విడివడ్డ తరవాత బంగ్లాకు వెళ్లింది. మొత్తంగా ప్రణబ్‌కు భారత రత్న రావడం సముచితం. ఆయనతోపాటు పివికి కూడా ఈ గౌరవం దక్కివుంటే దేశంతో పాటు, ప్రపంచంలో ఉన్న భారతీయులు హర్షించేవారు.