దూసుకెళ్తున్న పతంజలి బిజినెస్

pathanjaliఐదేళ్లలో రూ.లక్ష కోట్ల ఉత్పత్తుల తయారీ

గువహతి: ఇప్పటికే వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించిన పతంజలి ఆయుర్వేద్‌ వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌ (ఇ-కామర్స్‌) అమ్మకాలను పెద్ద ఎత్తున విస్తరించనుంది. అయితే మిగతా ఆన్‌లైన్‌ సంస్థల్లా తమ ఆన్‌లైన్‌ వ్యాపారంలో ఎలాంటి డిస్కౌంట్లూ ఉండవని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన యోగా గురు బాబా రాందేవ్‌ శనివారం తెలిపారు. ‘డిస్కౌంట్‌ ధరకు అమ్ముతున్న రెండు పెద్ద వ్యాపార సంస్థలకు నష్టాలు తప్పడం లేదు. అయినా మేము వచ్చే ఏడాది నుంచి ఇ-కామర్స్‌ను పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాం. డిస్కౌం ట్లు లేకుండానే మా ఉత్పత్తులను కొనుగోలుదారులకు వారి ఇంటి దగ్గరే అందిస్తాం’ అని రాందేవ్‌ చెప్పారు.

ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్‌
మరోవైపు పెద్ద ఎత్తున తన వ్యాపారాన్ని విస్తరించేందుకు పతంజలి ఆయుర్వేద సిద్ధమైంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసిన కంపెనీ, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రూ.10,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ‘మరో ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల విలువైన ఉత్పత్తి సామర్ధ్యం ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. ఇప్పటికే మా ఉత్పత్తులు 5,000 రిటైల్‌ దుకాణాల్లో, 10 లక్షల షాపుల్లో లభిస్తున్నాయి. వచ్చే ఏడాదికల్లా దీన్ని 30 లక్షల షాపులకు విస్తరిస్తాం’ అన్నారు.

అసోంలో మెగా ఫుడ్‌ పార్క్‌
అసోంలోని బాలిపార వద్ద రూ.1,200 కోట్లతో ‘పతంజలి హెర్బల్‌ అండ్‌ మెగా ఫుడ్‌ పార్క్‌’ ఏర్పాటు కానుంది. ఈ పార్కులోని ఫ్యాక్టరీలతో 10 లక్షల టన్నుల ఆయుర్వేద, ఆహార ఉత్పత్తులు తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. వచ్చే మార్చి నాటికి ఈ మెగా ఫుడ్‌పార్కు పూర్తవుతుందని రాందేవ్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పతంజలి రెండు ఫుడ్‌ పార్కులు ఏర్పాటు చేస్తోంది.