దేవాదుల పనులకు సహకరించాలి: ఎమ్మెల్యే

జనగామ,జూన్‌27(జ‌నం సాక్షి): ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, రైతుల కోసం చేపట్టే ప్రజోపయోగకర అంశాలకు అన్ని వర్గాలు సహకరించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చీటకోడూరు నుంచి పెంబర్తి వరకు దేవాదుల కాలువ పూర్తయితే ఈఏడాది వానాకాలంలోనే చీటకోడూరు రిజర్వాయర్‌ నింపి అక్కడి నుంచి పెంబర్తికి గోదావరి జలాలను తరలించి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. భూములు కోల్పోతున్న రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి నచ్చజెప్పారు. చీటకోడూరు దేవాదుల రిజర్వాయర్‌ నుంచి పెంబర్తికి సాగునీరు అందించే కాలువ భూసేకరణ, తవ్వకం పనులకు సహకరించాలని అన్నారు. ప్రాజెక్టు పనుల భూసేకరణ కోసం రైతులు సహకరించాలని, రైతులు భూములు ఇవ్వకుంటే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణాలు సాధ్యం కాదన్నారు. రైతులు నష్టపోతున్న భూములకు మార్కెట్‌ విలువకంటే రెట్టింపు మొత్తంలో ప్రభుత్వం పరిహారం అందిస్తుందని చెప్పారు. పనులు అడ్డుకోవడం, కాలువ నిర్మాణంపై కోర్టులను ఆశ్రయించడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. ఇకపోతే దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన చెరువులు మిషన్‌ కాకతీయతో కళకళలాడుతున్నాయన్నారు. మిషన్‌కాకతీయ ఇటు ప్రజలకు, అటు రైతులకు ఎంతో మేలు చేసిందని, జన జీవనంలో సైతం మార్పులు సంతరించు కుంటున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసారు. బోరుబావుల్లో నీరు పుష్కలంగా వచ్చింది. వలసలు తగ్గుముఖం పట్టాయి. రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలకు మిషన్‌ కాయతీయ పథకం మేలు చేసిందని హర్షం వ్యక్తం చేసారు. ఇకపోతే మిషన్‌ కాకతీయ పథకంతో చెరువులకు జలకళసంతరించుకుందని ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం రైతులకు ఎంతో మేలు చేసిందని, పల్లె జీవనంలో సైతం అనూహ్య మార్పులు వచ్చాయి. వలసలు తగ్గుముఖం పట్టాయి. భూగర్భ జలాలు పెరటడంతో బోరు బావుల్లో పుష్కలంగా నీరు వచ్చింది. ఆయకట్టు భూముల్లో కౌలు ధరలు రెట్టింపు అయ్యాయి. దీనికితోడు ఇతర వర్గాల వారికీ ఉపాధి లభిస్తోంది. ముఖ్యంగా మత్స్యకారులకు, చాకలి వారికి ఎంతో ప్రయోజనం చేకూరినట్లయింది. జిల్లా వ్యాప్తంగా 147 చెరువుల్లో మూడో విడత మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభం కాగా ఈ నెల ప్రారంభం నుండే విస్తారంగా వర్షాలు కురియడంతో పునరుద్ధరణకు నోచుకున్న చెరువులు పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకున్నాయి. చెరువుల్లో మిషన్‌ కాకతీయ మూడో విడత పనులు ప్రారంభమయ్యాయి. అయితే జూన్‌ మొదటి వారం నుంచి కురిసిన వర్షాలకు చెరువులు నిండి జలకళ సంతరించుకున్నాయి.