దేవాలయాలే లక్ష్యంగా దోపిడీ

ముఠా సభ్యలును పట్టుకున్న పోలీసులు

మహబూబాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): ఎట్టకేలకు గుడి దొంగలు అరెస్ట్‌ కావడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండేళ్లుగా పలు జిల్లాల్లోని దేవాలయాల్లోని విగ్రహాలు, ఆభరణాలను అపహరించిన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని కోట్యానాయక్‌తండాకు చెందిన నలుగురు వ్యక్తులను, సహకరించిన మరో ముగ్గురు బంగారం, తుప్పు విక్రయదారులను పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో దేవాలయాలనే లక్ష్యంగా చేసుకొని రూ.7లక్షల విలువైన దేవతా విగ్రహాలు, వెండి, బంగారు ఆభరణాలను దోచుకోగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. . ఈ ముఠా సభ్యులు మొత్తం 26 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. గార్ల మండలంలోని కోట్యానాయక్‌ తండాకు చెందిన టి.చందు, ఎ.రఘు, జి.బాబూరావు, డి.శ్రీను ముఠాగా ఏర్పడి గత రెండేళ్లుగా మూడు జిల్లాల్లోని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 13, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో 4, మహబూబాబాద్‌ జిల్లాలో 9 మొత్తం 26 నేరాలు చేశారు. వీరితోపాటుగా దొంగసొత్తును కొనుగోలు చేసిన గార్లకు చెందిన కె.రాజా, ఆర్‌.సుధాకర్‌తోపాటుగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని ఇనుము, తుప్పు వ్యాపారి బి.వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమేరా వీడియో చిత్రాలు, వేలిముద్రల ఆధారంగా బాధ్యులను విచారించి చోరీకి గురైన విగ్రహాలు, ఆభరణాలు వీరి నుంచి

స్వాధీనపరచుకున్నట్లు ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి వెల్లడించారు. చోరీకి పాల్పడిన వారిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను రివార్డులతో అభినందించారు.

—–