ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలా!
ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు అవసరమా..! ప్రజలు కూడా ఆలోచించాలి. రైతులు కూడా బాగా ఆలోచించాలి. బహుళజాతి కంపెనీలకూ ఎర్రతివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. నిజానికి కంపెనీలకు మించిన ఆదాయాన్ని, ఉద్యోగ కల్పనను వ్యవసాయరంగమే కల్పిస్తోంది. వ్యవసాయానికి పెద్దపీట వేసివుంటే ఈ రంగం దేశ ఆర్థిక పురోగతిలో కీలకం కానుంది. అనేక కంపెనీలకు ఇస్తున్న రాయితీల మాదిరి వ్యవసాయానికి కూడా రాయితీలు ఇచ్చి పంటల ఉత్పత్తిని సవాల్‌గా తీసుకోవాలి.. సేంద్రియ వ్యవసాయానికి చేయూతను ఇవ్వాలి. అలాగే దేశంలో ఉన్న వ్యవసాయభూముల్లో ఎక్కడెక్కడ ఏ పంట పండుతుందో తెలుసు కనుక అందుకు అనుగుణంగా పంటల విధానం తీసుకుని రావాలి. అయితే రైతులను ఓటు బ్యాంకుగా చూడడం అలవాటు చేసుకున్న పాలకులు వారిని దేశంలో ఆర్థికరంగంలో కీలకమైన వ్యక్తులుగా చూడడం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి యువతను ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగ సమస్యకు, పంటల కొనుగోళ్లకు చెక్ పెట్టవచ్చు. కానీ అలా జరగడం లేదు. సస్యవిప్లవానికి నాంది పలికేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు పూనుకో వాల్సిన తరుణంలో వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దేశీయంగా వ్యవసాయ పురోభివృద్దికి పాటుపడడం లేదని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలా చేయడం వల్ల వ్యవసాయం రంగం అతిపెద్ద ఉత్పాదక రంగంగా మారగలదని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెంచితే మంచిదని అంటున్నారు. అయితే ధాన్యం కొనుగోళ్ల వ్యవహారన్ని పక్కన పెట్టిన టిఆర్‌ఎస్ ఎందు కు దీనిపై రాజకీయం చేస్తోందన్నది ముఖ్యం. ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా చేయాల్సింది ధాన్యం కొనుగోళ్లు మాత్రమే. బియ్యం సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం పార్లమెంట్ వేదికగా ప్రకటిం చింది. కేంద్రమంత్రులు, బిజెపి నేతలు ప్రకటించారు. అయినా టిఆర్‌ఎస్ రాజకీయం చేయడం వెనక వేరే కోణం ఉందనే అనుకోవాలి. ఇది ధాన్యం కోసం కేంద్రంపై పోరాటం కాదన్నది అందరికీ అర్థం అవుతోంది. ఇకపోతే నీటి సౌకర్యం కల్పించి, 24 గంటల విద్యుత్ ఇస్తూ..రైతుబంధు ద్వారా ఆదుకుంటామని చెబుతున్న సిఎం కెసిఆర్ యాసంగిలో కిలో ధాన్యం కూడా కొనమని చెప్పడం కూడా రాజకీయం కాక మరోటి కాదు. ముందుగా వానాకాలం పంటలు కొనాలి. తరవాత యాసంగిలో ఏ ధాన్యం వేయాలో మండలాల వారీగా నిర్ణయించి..రైతులకు సూచనలు చేయాలి. అవసరమైతే వారినిచైతన్యం చేయాలి.కానీ అందుకు భిన్నంగా టిఆర్‌ఎస్ తీసుకున్న రాజకీయ నిర్ణయం కారణంగా నష్టపోయేది టిఆర్‌ఎస్ మత్రమే అని గ్రహించాలి. పోటాపోటీ ధర్నాలు,ర్యాలీలు, విమర్శలతో రాజకీయ లబ్ది పొందగలమేమో కానీ రైతుల సమస్యలను మాత్రం గుర్తించడం లేదు. ఎలా అయితే ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయో టిఆర్‌ఎస్ నేతలు రైతులకు చెప్పలేక పోతున్నాయి. ధాన్యం పండిరచిన రైతులు మాత్రం దిగాలుగా చూస్తున్నారు. నిజానికి ధాన్యం కొనుగోలు అన్నది ఒక పంటకు ముందే నిర్ణయించాలి. ఏ పంట వేయాలో ముందే చెప్పాలి. కానీ అదేవిూ చేయకుండా రాష్ట్రప్రభుత్వం విూద బిజెపి..కేంద్రంపై టిఆర్‌ఎస్ యుద్దం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించాలి. ఇది ప్రభుత్వం.. పార్టీల మధ్య పోరాటం కాదని గుర్తించడం లేదు. ఇది ప్రభుత్వాల మధ్య యుద్ధం మాత్రమే కాగలదు. రైతు పండిరచిన పంట కల్లాలు, మార్కెట్ యార్డ్‌లు, చివరకు రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తుంది.. కానీ, గిట్టుబాటు ధర చెల్లించి రైతు నుంచి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్న తీరు దారుణం కాక మరోటి కాదు. తాజా రాజకీయం మొత్తం వడ్ల
చుట్టే తిరుగుతోంది. వడ్ల పండిరచాలని ఒకరు, పండిరచవద్దని మరొకరు.. ఇలా రైతులను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ డిమాండ్ చేస్తుంటే.. కేంద్రమే పంట వేయొద్దు, కొనొద్దు అంటుంది అంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ మండిపడుతోంది.. ఇలా ఇరు పార్టీల మధ్య జరుగుతున్న పోరులో రైతులు అయోమయం లో పడిపోతున్నారు. తెలంగాణలో ఉన్నట్టుండి పంట పెరగడం ఒక కారణం అయితే.. ఆ స్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడమే సమస్యకు అసలు కారణంగా మారింది. అయితే, ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది.. వడ్లు, బియ్యం కొనుగోళ్లపై రాజకీయం దుమారమే రేపుతున్నారు.. సవాళ్లు, ప్రతి సవాళ్లు తప్ప తక్షణ సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. అధికారంలో ఉన్న బిజెపి,టిఆర్‌ఎస్ పార్టీల మధ్య అన్నదాత నలిగిపోతున్నాడు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఒకరి విూద ఒకరు నెపం నెట్టేసుకోవడం తప్ప ధాన్యం నిల్వలను కొనేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురియడంతో..సాగు విస్తీర్ణం పెరగడం, పుష్కలంగా పంట పడుతోంది.. ఇక, వరి పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు.. సాధారణంగా వడ్లను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎఫ్‌సిఐ కొనుగోలు చేస్తూ వస్తుంది. వరి పండే రాష్టాల్ర నుంచి వాటిని కొనుగోలు చేసి అవసరం ఉన్న రాష్టాల్రకు సరఫరా చేయడం వారి బాధ్యత.. కానీ, ఎఫ్‌సిఐ దగ్గర ఇప్పుడు బియ్యం నిల్వలు పెరిగిపోవడంతో.. వడ్ల కొనుగోలుకు ముందుకు రావడంలేదు.. వర్షాకాలంలో పండిన పంటను కొనుగోలు చేసినా.. యాసంగిలో పండిన పంటను మాత్రం కొనుగోలు చేయబోమని చెబుతుండడమే సమస్య జటిలంగా మారింది.. యాసంగిలో పండే పంటలో నూకలు అధికంగా వస్తుంటాయి.. దీంతో దానిని బాయిల్డ్ చేసి బియ్యంగా మార్చాల్సి ఉంటుంది. కొన్ని రాష్టాల్ల్రో ఈ బాయిల్డ్ రైస్‌ను తింటారు.. కానీ, గత యాసంగి నిల్వలే ఇంకా అధికంగా ఉండటంతో ఇప్పుడు యాసంగిలో పండే ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెబుతోంది. ఈ దశలో నీటి సంరక్షణతో పాటు, రైతు సంక్షేమానికి చర్యలు తీసుకునే ప్రణాళికలు ముందుకు సాగాలి. ఇకపోతే విదేశాల నుంచి నూనెల దిగుమతి వేరుశనగ రైతులకు శరాఘాతంగా మారింది. పంటల విధానంలో శాస్త్రీయ దృక్పథం లోపించ డం, సేంద్రియ ఎరువుల బదులు రసాయన ఎరువులు వాడడం వల్ల భూవిూ సారం తగ్గుతోంది. ఏ పంట పండిరచినా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. స్వాతంత్య్రం లభించి ఏడు దశాబ్దాలు పూర్తయినా ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో రైతుల సమస్యలు మరింత జఠిలం అవుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన వ్యవసాయిక విధానం లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారిపోయింది. ఫ్రీ మార్కెట్ అనేది ఒక అభూత కల్పన మాత్రమే అయ్యింది. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతన్నా రైతుల ఆర్థిక వ్యవస్థ మాత్రం బాగుపడడం లేదు. అవసరం లేకున్నా ఇబ్బడిముబ్బడిగా ఆహారధాన్యాలను దిగుమతి చేసు కోవడం కూడా రైతులకు శాపంగా మారింది. కల్తీలు కూడా రైతును కాటేస్తున్నాయి. మన అసవరాలకు సరిపడా కందులు, మిరప, ఇతర పంటలను రైతులు చెమటోడ్చి పండిరచినా వాటిని కొనుగోలు చేయడం లేదు. ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాల దిగుబడి తక్షణం ఆగిపోవాలని అన్నారు. అప్పుడు మన అసవరాలకు అనగుణంగా పంటల విధానం వస్తుందని అన్నారు. పంటల విధానంలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు.