ధాన్యం సేకరణలో అక్రమాలను సహించేది లేదు
అవసరమైతే నేరుగా కోర్టునే ఆశ్రయిస్తా
బిజెపి ఎంపి వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
లక్నో,అక్టోబర్29 ( జనం సాక్షి ) ప్రభుత్వ తీరును ఎండగట్టేలా బిజెపి ఎంపి వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయోత్పత్తుల సేకరణలో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, అవినీతికి పాల్పడినా తాను నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, ప్రభుత్వాన్ని కాదని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ రైతులు చప్పట్లు కొట్టారు. వరుణ్ గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన కొందరు అధికారులు, రైతులతో
మాట్లాడుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. తన నియోజకవర్గం ఫిలిబిత్‌కు ఓ ప్రతినిధిని నియమిస్తానని, వ్యవసాయోత్పత్తుల సేకరణలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరిగినా సహించేది లేదని చెప్పారు. ఏదైనా అక్రమం జరిగినట్లు తన దృష్టికి వస్తే, వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, ప్రభుత్వానికి ఎటువంటి విజ్ఞప్తి చేయబోనని చెప్పారు. ఆయన మాటలకు అక్కడివారు సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆయనకు మద్దతిచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతి సేకరణ కేంద్రంలోనూ అవినీతి విజృంభించిందని, ఈ విషయం పూర్తిగా బహిరంగమేనని వరుణ్ ఆరోపించారు. రైతులు తీసుకెళ్ళిన ధాన్యాలను బలవంతంగా తిప్పి కొడుతున్నారని, బాధిత రైతులు ఆ ధాన్యాలను నైరాశ్యంతో మధ్యవర్తులకు అమ్ముకోవలసి వస్తోందని పేర్కొన్నారు. పరిపాలనా యంత్రాంగం వాటాలు పుచ్చుకుంటోందని దుయ్యబట్టారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధ హావిూ ఉంటే తప్ప రైతులు తాము పండిరచిన పంటలను అతి తక్కువ ధరకు అమ్ముకోవలసిన దుస్థితి మారదని చెప్పారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధ హావిూ లభించే వరకు రైతులు మండీలలో దోపిడీకి గురవుతూనే ఉంటారన్నారు. రైతులు తాము పండిరచిన పంటలను తామే తగులబెట్టుకునే పరిస్థితులు రావడం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ గతంలో కూడా బీజేపీకి కొరుకుడుపడని ట్వీట్లు ఇచ్చారు. ఓ రైతు తన పంటను అమ్ముకోవడంలో విఫలమై, నైరాశ్యంతో దానిని తగులబెట్టినట్లు కనిపిస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక సంఘటనలపై కూడా ఓ ట్వీట్ చేశారు. ఈ సంఘటనలో కేంద్ర మంత్రి కుమారుని ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్ గాంధీ వ్యవహార శైలి కారణంగానే ఆయనను, ఆయన తల్లి మేనకా గాంధీని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తొలగించారనే ఆరోపణలు వచ్చాయి.