నకిలీ విత్తనాలపై సమాచారమివ్వండి
వరంగల్,మే20(జనంసాక్షి): నకిలీ విత్తనాల విక్రయాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులకు వివరించాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. త్వరలో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయని, అందుకోసం నకిలీ విత్తనాలను
పూర్తిగా నియంత్రించి రైతులు మోసపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలపై ఎల్కతుర్తి పోలీసులు తయారు చేసిన ప్లెక్సీని ఆదివారం కమిషనరేట్‌లో ఆవిష్కరించారు. ఎల్కతుర్తి సర్కిల్ పరిధిలో ప్రతి గ్రామంలో వీటిని ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు తయారు చేశామని ఆ పోలీసులు సీపీకి వివరించారు. ఇలా ప్లెక్సీలు తయారు చేసి అవగాహన కల్పించడంపై ఎల్కతుర్తి పోలీసుల పనితీరును అభినందించారు. నిఘా పెంచాలన్నారు. నకిలీ విత్తనాలు తయారీ, సరఫరా ఇతర విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాడులు చేయాలని సూచించారు. ఎవర్నీ వదిలిపెట్టవద్దన్నారు. రైతులు నకిలీ విత్తనాలు, పురుగుల మందులను గుర్తిస్తే 100 డయల్ లేదా 94910-89257 నెంబర్‌కు వాట్సాప్ సమాచారం ఇవ్వచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.