నన్ను తొలగించే కుట్ర జరుగుతుంది

– డబ్బుతో కొనలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు
–  లైంగిక ఆరోపణలపై సీజేఐ రంజన్‌ గొగోయ్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : తనపై లైంగిక ఆరోపణలు రావడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. జస్టిస్‌ గొగోయ్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ కోర్టు మాజీ జూనియర్‌ అసిస్టెంట్‌ శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లు ప్రచురించాయి. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జస్టిస్‌ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలను సంబంధిత అధికారి దృష్టికి తెచ్చారు. దీంతో సుప్రీం కోర్టు త్రి సభ్య బెంచ్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమేగాక.. తక్షణమే సమావేశమైంది. ఈ సందర్భంగా బెంచ్‌లో ఉన్న జస్టిస్‌ గొగోయ్‌ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పరిస్థితులు హద్దులు దాటడంతో తాను శనివారం కోర్టు బెంచ్‌లో కూర్చోవాలనే అసాధరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జస్టిస్‌ గొగోయ్‌ అన్నారు. సీజేఐగా నన్ను తొలగించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతోందని ఆరోపించారు. ఇరవై ఏళ్లు నిస్వార్థంగా సేవలందించాని గుర్తుచేసుకున్న ఆయన.. ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ ఈవిధమైన పనిచేస్తుందను కోవడంలేదన్నారు. ఇలాంటి ఘటనలతో న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రమాదం పొంచి ఉందని రంజన్‌ గొగోయ్‌ పేర్కొన్నారు.  ‘నమ్మశక్యంగా లేదని, ఈ ఆరోపణలను ఖండిచేందుకు నేను మరీ దిగజారి మాట్లాడదల్చుకోలేదని తెలిపారు. డబ్బు ఎరతో ఎవరూ నా దరిదాపుల్లోకి రాలేకపోయారు. అందుకే వేరే మార్గాలు వెతికారని, చివరికి ఇలా చేశారని గొగోయ్‌ అన్నారు. మొత్తం న్యాయవ్యవస్థే ప్రమాదంలో పడిందని, ఇలాగైతే మంచివాళ్ళెవరూ ఈ రంగంలోకి రారని జస్టిస్‌ గొగోయ్‌ అన్నారు.  విూడియా సంస్థలు ఇలాంటి వార్తల
విషయంలో కాస్త సంయమనం పాటించాలని బెంచ్‌ పేర్కొంది. క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఓ మహిళకు సుప్రీం కోర్టులో ఉద్యోగానికి ఢిల్లీ పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అన్నారు. మరోవైపు మహిళ ఆరోపణలు నిరాధారమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ కొట్టిపారేశారు. ఆ మహిళకు నేర చరిత్ర ఉందని, ఆమెపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయన్నారు సోలిసిటరీ జనరల్‌ తుషార్‌ మెహతా. నేరారోపణలు ఉన్న మహిళ సుప్రీంకోర్టులో సర్వీసులోకి ఎలా వచ్చిందని తుషార్‌ మెహతా ప్రశ్నించారు.