నవ భారత నిర్మాణమే లక్ష్యం


– అవినీతి రహిత పాలనకే ప్రాధాన్యమిస్తున్నాం
– రాఫెల్‌ యుద్ధ విమానాలతో సరిహద్దులు సురక్షితం
– నల్లధన కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టాం
– పన్ను చెల్లించే వారి సంఖ్య 6.8కోట్లకు చేరింది
– జీఎస్టీతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో పారదర్శకత తెచ్చాం
– 34 కోట్ల మందితో బ్యాంకుఖాతాలు తెరిపించాం
– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 77వ స్థానానికి చేరుకున్నాం
– 50కోట్ల మందికి ప్రభుత్వం ఆరోగ్య బీమాను అమలు
– గ్రావిూణ ఆవాస్‌ యోజన కింద కోటికిపైగా ఇళ్లు నిర్మించాం
– ప్రతీపౌరుడి జీవితంలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాం
– ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపుదిద్దుకొంది
– రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌
– నవభారత శకం ఆరంభమైంది – ఉపరాష్ట్రపతి వెంకయ్య
న్యూఢిల్లీ, జనవరి31(జ‌నంసాక్షి) : నవ భారత నిర్మాణానికి మా ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ అన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గురువారం ఆయన ప్రారంభోపన్యాయం చేశారు. ప్రతీ ఇంటికీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నామని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో అనేక కొత్త కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని గుర్తుచేసిన ఆయన.. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నిరుపేదలకు సైతం విద్యుత్‌ కనెక్షన్‌, గ్యాస్‌ కనెక్షన్లు అందుబాటులోకి తెచ్చామని.. మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల గౌరవాన్ని పెంచామని అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌తో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, హృదయాలకు ఉపయోగపడే స్టంట్‌ల ధరలను తగ్గించామని వెల్లడించారు. దేశంలోని 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. ఔషధాల ఖర్చు తగ్గించేందుకు జనఔషధి దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కిడ్నీ బాధితులకు ప్రత్యేక బీమా యోజన తీసుకొచ్చిందని తెలిపారు. వారికోసం ఉచితంగా డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, పలు రాష్టాల్లో కొత్తగా ఎయిమ్స్‌లను ఏర్పాటు చేశామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇక గ్రావిూణ ఆవాస్‌ యోజన కింద కోటికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. ప్రతీ పౌరుడి జీవితంలో వెలుగు నింపే ప్రయత్నం తమ ప్రభుత్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం రైల్వేస్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వారికి సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మరోవైపు బాలికలపై అత్యాచారాలు చేసేవాళ్లకు ఉరిశిక్ష విధించేలా చట్టం తెచ్చామని రాష్ట్రపతి అన్నారు. స్టార్టప్‌ ఇండియాతో పరిశ్రమలు స్థాపించే యువతను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నేడు అన్నిరంగాల్లో బాలికలు ముందజ వేస్తున్నారని, నేడు ముద్రా రుణాల్లో అత్యధిక సంఖ్యలో మహిళలకే దక్కాయన్నారు.
స్వచ్ఛభారత్‌ నిర్మాణంలో భాగంగా తొమ్మిదికోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించామన్నారు. దీంతో 3లక్షల కుటుంబాలకు ఆరోగ్యం చేకూరిందని.. మహిళల గౌరవాన్ని పెంచామని రాష్ట్రపతి వివరించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.
నల్లధనం కట్టడికి చర్యలు ..
దేశంలో నల్లధనం కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టాంమని రాష్ట్రపతి అన్నారు. మాప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జన్‌ధన్‌ యోజన కింద 34 కోట్ల మందికి బ్యాంకుఖాతాలు తెరిచామని, 2014కి ముందు దేశంలో 3.8 కోట్ల మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లించేవారని, ప్రస్తుతం 6.8కోట్ల మంది చెల్లిస్తున్నారన్నారు. జీఎస్టీ ద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో పారదర్శకత తీసుకొచ్చామన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత్‌ 77వ స్థానానికి చేరుకొందని తెలిపారు. ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపుదిద్దుకొందన్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా ఏపీలో మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు చేశామన్నారు. యువత స్వావలంబన కోసం స్టార్టప్‌ కేంద్రాలను ప్రారంభించామన్నారు. వీటి ద్వారా పరిశ్రమలు స్థాపించేందుకు యువతను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ద్వారా లక్షలాది మందికి ఇళ్లు లభించాయన్నారు. గృహనిర్మాణాల్లో సమస్యలు తొలగించేందుకు రేరా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని కోవింద్‌ చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్రపతి తెలిపారు. 18వేలకు పైగా గ్రామాల్లో విద్యుదీకరణ చేపట్టామన్నారు. ఇప్పుడు
ప్రతి ఇంటికీ విద్యుత్తు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. దివ్యాంగుల కోసం సౌకర్యవంతమైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, వారికి ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చామన్నారు. ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, తక్కువ ప్రీమియంతో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. నీలివిప్లవం ద్వారా మత్స్యకారులకు సాంకేతిక సాయం అందిస్తున్నామన్నారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంతో గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం, ఈ-గవర్నెన్స్‌ తీసుకొచ్చాం. 40 వేలకు పైగా గ్రామాల్లో వ్గై/ హాట్‌స్పాట్‌ సౌకర్యం కల్పించామని రాష్ట్రపతి వివరించారు.
దేశ భద్రత కోసమే కొత్త రక్షణ ఒప్పందాలు..
రాష్ట్రపతి తన ప్రసంగంలో రక్షణ ఒప్పందాల గురించి ప్రస్తావించారు. దేశ భద్రత కోసమే కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. రాఫెల్‌ యుద్ధ విమానాలతో సరిహద్దులు సురక్షితమన్నారు. సర్జికల్‌ స్టైక్స్‌ అద్భుతమంటూ భారత ఆర్మీని ప్రశంసించారు. నవభారతం నిర్మాణం కోసం నాలుగేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. అవినీతిరహిత భారత్‌ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. 2019 భారతదేశానికి కీలక సంవత్సరమన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
నవభారత శకం ఆరంభమైంది – ఉపరాష్ట్రపతి వెంకయ్య
నవ భారతదేశ నిర్మాణం దిశగా ఎన్డీయే ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందన్నారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 130 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులతో మా ప్రభుత్వం నవ భారత నిర్మాణం దిశగా ప్రయాణం మొదలుపెట్టిందన్నారు. ఈనూతన భారతదేశంలో.. ప్రతిఒక్క పౌరుడు ప్రాథమిక సౌకర్యాలు అందుకుంటాడని అన్నారు. ప్రతి పౌరుడికి తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తుందని వెంకయ్య పేర్కొన్నారు. ప్రతి పిల్లాడికీ ఎలాంటి లోటు లేకుండా జీవన ప్రగతి సాధ్యమవుతుందని, ప్రతి ఆడబిడ్డా నిర్భయంగా జీవిస్తుందని, ప్రతి ఒక్కరికీ గౌరవంగా న్యాయం జరుగుతుందన్నారు. యావత్‌ ప్రపంచమే గౌరవించేలా నవ భారతదేశం సగర్వంగా నిలబడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు.