నానో కారుకు టాటా

ఇక ముగియనున్న చిన్నకారు మురిపెం

ముంబై,జనవరి24(జ‌నంసాక్షి): రతన్‌ టాటా కలల కారు నానోకు టాటా మోటార్స్‌ గుడ్‌ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. 2020 ఏప్రిల్‌నాటికి ఈ కారు తయారీని పూర్తిగా నిలిపేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి పరోక్షంగా వెల్లడించారు. పేదమధ్య తరగతి వారికి తక్కువ ధరలో కారును తసీఉకునిరావాలన్న సదుద్దేశంతో దీనిని రూపొందించారు. బీఎస్‌-ఎ ప్రమాణాలకు అనుగుణంగా నానోను తీర్చిదిద్దడానికి తాము మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేమని టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ వెహికిల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ చెప్పారు. నానో కారును సనద్‌ ప్లాంట్‌లో తయారు చేస్తున్నాం. జనవరిలో కొత్తగా కొన్ని భద్రతా నిబంధనలు వచ్చాయి, ఏప్రిల్‌లో మరికొన్ని రానున్నాయి. అలాగే అక్టోబర్‌లో మరికొన్ని.. ఇక 2020 ఏప్రిల్‌ నాటికి బీఎస్‌-ఎ ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అయితే అన్ని ఉత్పత్తులను ఈ స్థాయిలో చేయడానికి మేము పెట్టుబడులు పెట్టలేం. అందులో నానో కూడా ఒకటి అని మయాంక్‌ స్పష్టం చేశారు. మధ్యతరగతి జీవులకు అతి తక్కువ ధరలో కారు ఇవ్వాలన్న ఆలోచనతో రతన్‌ టాటా ఈ నానో కారుకు అంకురార్పణ చేశారు. 2009లో రూ.లక్ష ధరతో ఈ కారు మార్కెట్‌లోకి వచ్చింది. పదేళ్లలోనే ఈ కారు కథ ముగిసిపోయింది. ఇప్పటికే నానో సేల్స్‌ దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో నానోతోపాటు మరికొన్ని టాటా ప్యాసెంజర్‌ వెహికిల్స్‌ తయారీని కూడా నిలిపేయాలని అనుకుంటున్నట్లు పరీక్‌ చెప్పారు.