నామినేషన్లు షురూ..
` ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ అయింది. ఈ నెల 10 వరకు నామపత్రాలను స్వీకరిస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 13న నామినేషన్లను పరిశీలిస్తారు. 15 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. అదేరోజు సాయంత్రం అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటిస్తారు. రాష్ట్రంలోని 119 నియో జకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరుగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. పోలింగ్ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల ద్వారా నిర్వహించనున్నారు. కాగా, నామినేషన్ల సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్టంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయకూడదు.