నామినేషన్‌ దాఖలు చేసిన సాధ్వి

భోపాల్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్న సాధ్వి ప్రగ్యా సింగ్‌
ఠాకూర్‌ సోమవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఆమెవెంట ముగ్గురు నేతలు, ఆమె తరఫు లాయర్‌ హాజరయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ పోటీలో ఉన్నారు. గాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వికి బీజేపీ వ్యూహాత్మకంగా భోపాల్‌ నుంచి టిక్కెట్‌ ఇచ్చింది. హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని తొలిసారి వాడిన దిగ్విజయ్‌కు సింగ్‌కు సాధ్వీనే గట్టి పోటీ అని, సాధ్విని తప్పుడు ఆరోపణలతోనే కేసులో ఇరికించారని ఆ పార్టీ అగ్రనేతలు సమర్ధిస్తున్నారు. కాగా ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన ఏటీఎస్‌ చీఫ్‌ కర్కరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా సాధ్వి ఒక్కసారిగా ప్రచారంలోకి వచ్చారు. తనశాపం వల్లే కర్కరే ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అమరువీరుల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేలిపోయిందంటూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు, ఐపీఎస్‌ అధికారులు ఆక్షేపించారు. దీంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. సాధ్వి వ్యాఖ్యలు ఆమె వ్యక్తగతమంటూ వివరణ ఇచ్చింది. దీనిపై ఈసీ నోటీసులు ఇవ్వడంతో సాధ్వి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే, కొద్ది గంటల వ్యవధిలోనే మళ్లీ అయోధ్య అంశాన్ని సాధ్వి లేవనెత్తుతూ, అయోధ్యలో కట్టడం కూల్చివేతలో తాను పాల్గొన్నందుకు గర్విస్తున్నానని, అయోధ్యలో ఆలయ నిర్మాణానికి తప్పనిసరిగా వెళ్లారని, తనను ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.