నా బిడ్డను ఎందుకు అరెస్టు చేశారంటూ.. దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌ ఎదుట విజయమ్మ ధర్నా

హైదరాబాద్‌, మే 28 (జనంసాక్షి) : అక్రమాస్తుల కేసులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అరెస్టును ఆయన తల్లి విజయమ్మ తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి జగన్‌ అరెస్టు తర్వాత విజయమ్మతోపాటు, జగన్‌ సోదరి షర్మిల, బావ అనిల్‌, బంధువు వై.వి.సుబ్బారెడ్డి జగన్‌ను విచారించిన దిల్‌కుషా గెస్ట్‌కు వచ్చి జగన్‌ను కలిశారు. అనంతరం బయటకు వచ్చి విజయమ్మ తన కొడుకు అరెస్టును వ్యతిరేకిస్తూ పక్కనే రైలు పట్టాలపై బైఠాయించి, ధర్నాకు దిగారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన బిడ్డ అరెస్ట్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం సాధించాలనుకుంటున్నాయో వివరించాలని డిమాండ్‌ చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్లు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన మాట కోసం సోనియా మాట వినకుండా ఓదార్పు యాత్ర చేపట్టడమే జగన్‌ చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఈ పరిణామాలు చూస్తుంటే తన వైఎస్సార్‌ మరణంపై కూడా అనుమానాలు కలుగుతున్నాయని విజయమ్మ అనుమానం వ్యక్తం చేశారు. దేవుడు అంతా చూస్తున్నాడని, ఆయన తమపై కక్ష సాధిస్తున్న వారికి గుణపాఠం చెబుతాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా తన భర్త చేసిన సేవలకు, 2009లో ఆయన మళ్లీ కాంగ్రెస్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలను అధి కారంలోకి తెచ్చి నందుకు ఇదేనా ప్రతిఫలం అని ఆమె వాపోయారు. రెండున్నరేళ్లుగా తమను వేధిస్తూ, జగన్‌ను అరెస్టు చేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం కుట్ర చేసిందని, అందులో భాగంగానే ఆదివారం పక్కా ప్రణాళిక తో జగన్‌ను అరెస్టు చేయించారని విజయమ్మ విమర్శించారు. ధర్నా కొనసాగుతుండగా పోలీసుల జోక్యం చేసుకొని వారిని బలవంతంగా వాహనాల్లో లోటస్‌ పాండ్‌ వద్ద దించివేసారు

తాజావార్తలు