నిజామాబాద్‌ పారిశ్రామికాభివృద్ధికి కృషిచేస్తా

త్వరలో ఇందూరులో ఐటీ టవర్‌

ఎంఓయూకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు కవిత పిలుపు

వరంగల్‌,ఆగస్టు30 : నిజామాబాద్‌ జిల్లాను పారిశ్రామికంగా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని నిజామాబాద్‌ ఎంపీ కవిత తెలిపారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన నిజామాబాద్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నూతన కమిటీ బాధ్యతల స్వీకారోత్సవానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌కే పరిమితమైన పారిశ్రామికాభివృద్ధిని జిల్లాలకూ విస్తరించాలని ముఖ్యమంత్రి కెసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని ఆమె చెప్పారు. పరిశ్రమలకు అవసరమయిన విద్యుత్‌, నీటిని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నదని తెలిపారు. పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని ఎంపీ కవిత తెలిపారు. గతంలో కరెంటు కోతలకు నిరసనగా ఇందిరాపార్కు వద్ద ధర్నాలు జరిగేవని, సీఎం కేసీఆర్‌ ప్లానింగ్‌ తో ఆ పరిస్థితి లేకుండా చేశారని వివరించారు. ఇక మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే పనులు వేగంగా జరుగుతున్నాయని, పరిశ్రమలకు 10 శాతం నీరందించేలా వాటర్‌ను రిజర్వ్‌ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. జిల్లాల్లో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాల్సి ఉందని, గత సమావేశంలోనే ఒక ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా చేయూతనిస్తామని చెప్పిన విషయాన్ని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులకు గుర్తు చేస్తూ ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు.పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు, సౌకర్యాలను సమకూర్చుతున్నట్లు తెలిపారు. గ్రామాల నుంచి, జిల్లా కేంద్రానికి, ఇక్కడి నుంచి రాజధాని హైదరాబాద్‌కు, పొరుగు రాష్టాల్రకు రోడ్డు కనెక్టివిటీ సౌకర్యం బాగుందన్నారు. రూ.1200 కోట్లు వ్యయం చేసి రోడ్లను అభివృద్ధిపరచినట్లు కవిత తెలిపారు. మార్కెట్ల ఆధునీకరంచంతో పాటు సబ్‌ మార్కెట్లనూ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మంలో ఐటీ టవర్‌ను రూ. 25 కోట్లతో నిర్మిస్తున్నందున, నిజామాబాద్‌లోనూ అలాంటి టవర్‌ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత నిరుద్యుగులకు ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ మంత్రి కేటీఆర్‌ను కోరినట్లు కవిత తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే రూ. 25 కోట్లతో నిజామాబాద్‌లో ఐటీ టవర్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఐటీ రంగ నిపుణులు ఎంఓయు కుదర్చుకునేందుకు ముందుకు రావాలని కోరారు. వ్యవసాయాధారిత జిల్లా అయిన నిజామాబాద్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్టీన్రి అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి లక్కంపల్లిలో పెండింగ్‌లో ఉన్న ఎస్‌.ఇ.జడ్‌ పనులకు కేంద్ర మంత్రి సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ చేత ప్రారంభించిన విషయం తెలిసిందేనన్నారు. పతంజలి సీఇఓ బాలకృష్ణను కూడా ఎస్‌ఇజడ్‌ను చూపించామని, రూ.100 కోట్లతో పతంజలి యూనిట్‌ను 200 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారన్నారు. వారికి అవసరమైన స్థలం కోసం చూస్తున్నట్లు కవిత వివరించారు. నిజామాబాద్‌లో పసుపు సాగు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పసుపు ఆధారిత పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం మ ద్ధతు కూడగడుతున్నామని, ప్రధానిని కూడా కలిసిన విషయం తెలిసిందేనన్నారు. స్పైస్‌ పార్క్‌ కోసం రాష్ట్రప్రభుత్వం 42 ఎకరాలను సేకరించిందని చెప్పారు.నిజామాబాద్‌ రూరల్‌లో 800 ఎకరాల భూమి ఎయిర్‌పోర్టు కోసం గతంలో సేకరించారని, విమానయాన మంత్రిత్వ శాఖ ఆసక్తి చూపకపోవడంతో ఆ భూమిలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రిని కోరినట్ల తెలిపారు. దేశంలోనే నిజామాబాద్‌ పారిశ్రామికంగా నెంబర్‌ 1 కావాలనేది తమ లక్ష్యమన్నారు.