నిధుల కొరతలో సర్కారీ పాఠశాలలు

పూర్వ విద్యార్థులు ఆదుకోవాలన్న మంత్రి జవదేకర్‌

ముంబై,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): సర్కారీ పాఠశాలలు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, పూర్వ విద్యార్థుల ద్వారా ఆర్థిక సహకారం పొందాలని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ సూచించారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలు, కళాశాలలకు విధిగా ఎంతో కొంత విరాళాలు ఇవ్వాలని సూచించారు. పుణెళిలోని జ్ఞాన ప్రబోధిని పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కొన్ని పాఠశాలలు నిధుల కోసం ప్రభుత్వం వద్ద బిచ్చమెత్తుకుంటున్నాయి. అలా చేసే బదులు సాయం కోసం వారు తమ పూర్వ విద్యార్థులను సులువుగా సంప్రదించవచ్చు. తాము చదువుకున్న విద్యాలయానికి విరాళం ఇవ్వాల్సిన కనీస బాధ్యత పూర్వ విద్యార్థులపై ఉంది. ‘పాఠశాల ఎంతో ఇచ్చింది.. దాన్ని తిరిగి ఇచ్చేయాలి’ అన్న ధోరణి అవలంబించాలని జావడేకర్‌ వ్యాఖ్యానించారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్న మంత్రి.. మా రోజుల్లో ఈ-శిక్షణ తరగతులు లేవు. డిజిటల్‌ వనరులేవీ అప్పుడు లేవు. కానీ ఇప్పుడు ఏడో తరగతి విద్యార్థి నాలుగో తరగతి పాఠ్య పుస్తకంలోని సమస్యను చేయలేకపోతున్నాడు. ఇది దురదృష్టకరం. గతేడాది కేంద్రం జాతీయ స్థాయిలో పిల్లల్లో ఉన్న నైపుణ్యాలపై సర్వే చేపట్టింది. లక్షల సంఖ్యలో వివిధ తరగతుల విద్యార్థులను పరిశీలించింది. దీనిపై జిల్లాల వారీగా నివేదికలు తయారు చేయించి సంబంధిత జిల్లా ఎంపీలకు పంపుతాం. దీనివల్ల ప్రజా ప్రతినిధులకు తీవ్రత అర్థమవుతుంది. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు సమాజం కూడా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి అన్నారు.