నిన్ను నువ్వు తెలుసుకో అన్న శంకరాచార్య

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మనిషి చూస్తున్న ప్రపంచం, కార్యకారణ పర్యవసానాల మధ్య సాగే ఒక
మహానాటకమని గుర్తించిన మహామేధావి శంకరులు. ఆయన ప్రతిపాదించిన అద్వైత వాదానికి మూలసూత్రమైన కర్మ సిద్ధాంతం చెప్పేది ఈ కార్యకారణాలనే. భౌతిక ప్రపంచంలో మనిషి ఉనికిని ప్రభావితం చేసేవి ఈ కార్యకారణాలేనని, ఆత్మకు మాత్రమే వాటిని నియంత్రించగల శక్తి ఉందని తెలియజెప్పారు. కార్యకారణాల ప్రభావం సన్నగిల్లాలంటే ‘నువ్వెవరో’ నువ్వు ముందు తెలుసుకోవాలన్నారు. సకల చరాచర జగత్తు ఒకే ఒక ఆత్మతత్వం నుంచి ఉద్భవించిందని, జీవాత్మ పరమాత్మలన్నవి ఒక్కటేనని, ద్వైతానికి తావే లేదని ఆయన నిర్ద్వందంగా చెప్పారు. ఆ సిద్ధాంత సారమే ఆయన మనముందుంచిన మాయావాదం. జగత్తును సృష్టించింది దేవుడని ఆయన ఒక్కడే మనుషుల కర్మలన్నీ నిర్దేశించి కర్మఫలాలు నిర్ణయిస్తాడని నిర్దుష్టమైన వాదనలతో నిరూపించారు. ఆయన తార్కిక జ్ఞానం తిరుగులేనిది. తెలిసిన దాని నుంచి తెలియని ఆ బ్రహ్మాన్ని చేరుకునే శరణాగతుడు కాగల అత్యుత్తమ అవస్థకు మనిషిని చేర్చేలా ఆయన వాదనలుంటాయి.వైదిక కర్మలన్నీ దేహాన్ని, మనసును శుద్ధిపరచుకుని వేదాంత జిజ్ఞాస పెంపొందించుకునేందుకే ఉన్నవని నమ్మిన శంకరులు వేదాంత విచారం కోసం- ఇతర వర్ణాశ్రమాల కన్నా, సన్యాసాశ్రమమే సరైనదని భావించారు. అతి పిన్నవయస్సులోనే అది స్వీకరించారు. అహాన్ని అధిగమించి దాని స్థానంలో ఆత్మసాక్షిని ప్రవేశపెట్టుకునేందుకు అదే సరైనదని అనుకున్నారు. పన్నెండు సంవత్సరాల ప్రాయంలోనే వేదాలు నాలుగూ క్షుణ్నంగా అధ్యయనం చేసి పన్నెండు శాస్త్రాల్లో తిరుగులేని పాండిత్యం సంపాదించారు. ఆసేతు హిమాచల పర్యంతం కాలినడకన పర్యటించి సనాతన ధర్మ సత్‌ సంప్రదాయాలను సంరక్షించారు. హైందవ ధర్మజ్యోతి నిరంతరం వెలుగుతూ ఉండేందుకు దేశం నలుమూలలా ధర్మపీఠాలు ఏర్పాటుచేశారు.