నిరుద్యోగుల ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్‌

ఉద్యమ సందర్భంలో చేసిన హావిూలు ఏమయ్యాయి
మాడీ,కెసిఆర్‌లు రీ డిజైన్‌ నిపుణులు
ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్న కెసిఆర్‌
నిరుద్యోగ గర్జనలో మోడీ,కెసిఆర్‌లపై ఫైర్‌ అయిన రాహుల్‌
తెలంగాణ యువత ఆకాంక్షలను నెరవేరుస్తామని హావిూ
హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హావిూ ఇచ్చారు. రైతుల సమస్యలను కూడా పరిస్కరిస్తామని అన్నారు. తెలంగాణ యువత దేనికోసమైతే కొట్లాడారో ఆ ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి రాహుల్‌  తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. సరూర్‌నగర్‌లో నిరుద్యోగ గర్జన సభకు రాహుల్‌ హాజరై తెలంగాణ ప్రభత్వంపై నిప్పులుచెరిగారు. ఉద్యమకారులకు న్యాయం చేస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినప్పుడు నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడరన్నారు. అంతేకాదు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కలలు కన్నారు. ఏ స్వప్నం కోసం ప్రజలు కలలు కన్నారో.. అవన్నీ కలలుగానే మిగిలిపోయాయన్నారు. తెలంగాణ బిడ్డల కలలు నెరవేరకపోవడం బాధగా ఉందన్నారు.
తెలంగాణ ఏర్పాటులో విద్యార్థుల పాత్ర ఎనలేనిదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. సరూర్‌ నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. కాగా, రాహుల్‌ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టడంతో జనం నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియమకాల కోసం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించిందన్నారు. తెలంగాణ కోసం చాలా మంది అమరులయ్యారన్నారు. లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేసీఆర్‌ చెప్పారన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. కనీసం 10 వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటివరకు నోటీఫికేన్లు లేవని, రిక్రూట్‌మెంట్లు లేవని రాహుల్‌ ఎద్దేవా చేశారు. అయితే వాటిని సాకారం చేస్తామని రాహుల్‌ హావిూ ఇచ్చారు.   ‘విద్యార్థి-నిరుద్యోగ గర్జన’సభలో టీఆర్‌ఎస్‌, ఎన్డీయే ప్రభుత్వాలపై ఆయన ధ్వజమెత్తారు. మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆశపడ్డాం, కానీ కొత్తగా వచ్చిన సీఎం నిరుద్యోగులకు, విద్యార్థులకు ఒరగబెట్టిందేం లేదని అన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి టెండర్లు పారదర్శకంగా లేవని విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా కేసీఆర్‌ కుటుంబం ఆధిపత్యమే ఉందని అన్నారు. నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు రీడిజైన్‌లో స్పెషలిస్టులని ఎద్దేవా చేశారు. మోదీ నోట్ల రద్దు చేస్తే.. కేసీఆర్‌ దానికి వంతపాడారని అన్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద మోదీ, హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌లో కేసీఆర్‌ నిరసనలు చేపట్టనీయకుండా నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నరేంద్రమోదీ బేటీ బచావో.. బేటీ పడావో అనే నినాదమిచ్చారు. కానీ,  బిహార్‌లో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశంలోని మహిళలపై ఇంతటి అమానుష ఘటనలు జరుగుతున్నా మోదీ మౌనం వీడడం లేదని రాహుల్‌ అన్నారు. మోదీ తన నినాదంలో ఆడపిల్ల ఎవరి నుంచి రక్షించబడాలో చెప్పలేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి ఆడపిల్లలను రక్షించాలా అని మోదీని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్‌ లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారని గుర్తుచేశారు. కానీ ఆ వాగ్దానాలు ఏమయ్యాయని రాహుల్‌ నిలదీశారు. పేద బిడ్డల కోసం ఏర్పాటు చేసిన ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకాన్ని కేసీఆర్‌ దూరం చేశారని ఆరోపించారు. అలగే రైతుల కోసం కూడా కేసీఆర్‌ అనేక వాగ్దానాలు చేశారన్నారు. దాదాపు 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. కేసీఆర్‌ మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని రాహుల్‌ మండిపడ్డారు. మరోవైపు ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ రీ డిజైన్లు చేస్తుంటే.. తెలంగాణలో కేసీఆర్‌ రీ డిజైన్లు చేస్తున్నారని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. రీ డిజైన్ల పేరుతో ఇద్దరూ కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ చేసే రీ డిజైన్లను కేసీఆర్‌ సమర్థిస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని కేసీఆర్‌ స్వాగతించారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ధనవంతుల రుణాలు మాఫీ చేస్తున్నారు కానీ.. రైతుల రుణమాఫీ మాత్రం చేయడంలేదని విమర్శించారు.  ఎలాంటి అనుభవం లేని అనిల్‌ అంబానీ కంపెనీకి రాఫెల్‌ కాంట్రాక్ట్‌ ఎలా అప్పగిస్తారని రాహుల్‌ నిలదీశారు. రాఫెల్‌ డీల్‌తో అనిల్‌ అంబానీకి కోట్ల రూపాయిల గిప్ట్‌గా ఇచ్చారన్నారు. పార్లమెంట్‌లో తాను అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. రాఫెల్‌ డీల్‌పై ఫ్రాన్స్‌ ప్రధానితో తాను మాట్లాడినప్పుడు ఎలాంటి రహస్యం లేదని చెప్పారని వ్యాఖ్యానించారు. కానీ మన రక్షణ మంత్రి మాత్రం రహస్యం అంటున్నారన్నారు. రాఫెల్‌ డీల్‌పై ఎక్కడైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని రాహుల్‌ సవాల్‌ విసిరారు. దళితులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడడంలేదని రాహుల్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తను అబద్దపు వాగ్దానాలు చేయడానికి ఇక్కడకు రాలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక కలను చూశారని, ఆ కలను సాకారం చేయడం కోసమే ఇక్కడకు వచ్చానని రాహుల్‌ స్పష్టం చేశారు. నాలుగేళ్ల కాలంలో ఏ కల కోసం తెలంగాణ పోరాడి తెచ్చుకున్నామో… ఆ కలల పునాదులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదని రాహుల్‌ విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా, పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌, మల్లు భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి, కోమటిరెడ్డి బ్రదర్స్‌,జానారెడ్డి, సర్వే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు వేలాదిగా నిరుద్యోగులు, యువకులు, కార్యకర్తుల హాజరయ్యారు.