నూతన టెలికాం విధానానికి..  కేంద్ర మంత్రివర్గం ఆమోదం


– త్వరలో అమల్లోకి నూతన విధానం
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : టెలికాం రంగంలో సంస్కరణలకు కీలక ముందడుగు పడింది. కొత్త టెలికాం విధానానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ(ఎన్డీసీపీ) 2018 పేరుతో ఈ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది.
ఎన్డీసీపీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు విూడియాకు వెల్లడించాయి. 2022 నాటికి డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ రంగంలో 100 బిలియన డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం, 40 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా టెలికాం రంగంలో సంస్కరణలు చేయాలని కేంద్రం భావించింది. ఇందుకోసం కొత్త టెలికాం విధానాన్ని ప్రతిపాదించింది. టెలికాం రంగంలో పెట్టుబడులను పెంచడంతో పాటు 5జీ టెక్నాలజీ సాయంతో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను మెరుగుపర్చడం, అందుబాటు ధరల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ సేవలను తీసుకురావడం కోసం ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. అంతేగాక.. స్పెక్టమ్ర్‌ ధరలను హేతుబద్ధం చేయటం ద్వారా అప్పుల ఊబిలో ఉన్న టెలికాం రంగాన్ని పునరుత్తేజం చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం టెలికాం రంగం రూ. 7.8లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ సమయంలో అధిక స్పెక్టం ధరలు, ఇతర ఛార్జీలు ఈ రంగానికి సవాలుగా మారాయి. దీంతో వీటిని హేతుబద్ధీకరించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చింది.