నూయీ అత్యంత శక్తివంతమైన మహిళ
– అమెరికా అధ్యక్షుడు ట్రంప్
– సీఈఓలకు విందు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు
న్యూయార్క్, ఆగస్టు8(జనం సాక్షి) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలువురు ప్రముఖ కార్పొరేట్ నేతలకు విందు ఇచ్చారు. న్యూజెర్సీలోని తన వ్యక్తిగత గోల్ఫ్ కోర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ విందుకు పెప్పికో నుంచి తప్పుకోనున్న సీఈఓ ఇంద్రా నూయీ, మాస్కర్ కార్డ్స్ సీఈఓ అజయ్ బంగా కూడా పాల్గొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై దేశంలోని పలువురు కార్పొరేట్ లీడర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ట్రంప్ ఈ విందును ఇచ్చారు. ఇంద్రా నూయీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళ అని ట్రంప్ అన్నట్లు వైట్‌హౌస్ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఆర్థిక వ్యవహారాలపై ముందుకెళ్లేందుకు పలువురు సీఈఓల అభిప్రాయాలు, వారి దృష్టి కోణం, వారి ప్రాధాన్యతలు, ఆలోచనలు తెలుసుకునేందుకు ట్రంప్ ఈ సమావేశాన్ని ఉపయోగించుకుంటున్నారని అధ్యక్ష నివాసం వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వైట్‌హౌస్ విడుదల చేసిన విందుకు హాజరైన వారి జాబితా ప్రకారం.. ఇంద్రా నూయీ తన భర్త రాజ్ నూయీతో కలిసి వెళ్లగా అజయ్ బంగా తన సతీమణి రీతూ బంగాతో కలిసి విందుకు వెళ్లారు. నిన్న జరిగిన ఈ విందుకు 15 మంది ప్రముఖ సీఈఓలు హాజరైనట్లు తెలుస్తోంది. ఫియర్ క్రిస్లర్ సీఈఓ మైకేల్ మాన్‌లే, ఫెడ్‌ఎక్స్ ప్రెసిడెంట్ సీఈఓ ఫ్రెడ్రిక్ స్మిత్, బోయింగ్ సీఈఓ డెన్నిస్ ములెన్‌బర్గ్ సహా పలువురు హాజరయ్యారు. విందులో ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంక, ఆమె భర్త జేర్న్ కుష్నర్ కూడా పాల్గొన్నారు.