నెరవేరనున్న మధ్యతరగతి సొంతింటికల
` గృహ నిర్మాణం కోసం వడ్డీలేని రుణం
` మరో కొత్తపథకానికి కేసీఆర్ రూపకల్పన
` అభివృద్ధి,సంక్షేమంలో తెలంగాణ టాప్
` పదేళ్లలో రాష్ట్ర ముఖచిత్రమే మారేలా కార్యక్రమాలు
` ప్రగతినివేదికను విడుదల చేసిన కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ వాసులకు మరో శుభవార్త వినిపించనున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆకర్షణీయమైన పథకాలు, హావిూలతో జనరంజకమైన మేనిపెస్టో ప్రకటించిన బీఆర్‌ఎస్ పార్టీ.. త్వరలోనే ఇంకో కొత్త పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. హెచ్‌ఐసీసీలో క్రెడాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్థిరాస్తి శిఖరాగ్ర సదస్సు 2023 లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదిన్నరేళ్లలో.. కొవిడ్ మహమ్మారితో పాటు ఎన్నికల వల్ల కేవలం ఆరున్నరేళ్లు మాత్రమే పరిపాలించామని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా.. కొత్తగా ఇల్లు కొనుక్కోవాల నుకుంటున్న వారి కోసం సరికొత్త పథకాన్ని ప్లాన్ చేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరి ఇల్లు అనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదం పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నది తమ ఉద్దేశమని తెలిపారు. అయితే.. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అంటే.. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తారా అని డౌట్ రావచ్చని.. డబుల్ బెడ్ రూం ఇండ్లు, గృహలక్ష్మి రెండూ ఉంటాయని.. వాటితో పాటుగా మరో కొత్త పథకాన్ని కూడా కేసీఆర్ ఆలోచించారని కేటీఆర్ తెలిపారు. కొత్తగా ఇళ్లు కొనాలనుకుంటున్న మధ్యతరగతి కుటుంబాల కోసం త్వరలోనే కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఎవరైతో లోన్ తీసుకుని ఇండ్లు కొనుక్కోవాలనుకునే మిడిల్ క్లాస్ వారి కోసం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చూస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే ఆ లోన్‌కు సంబంధించిన ఇంట్రెస్ట్‌ను ప్రభుత్వమే కట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. దీని ద్వారా.. ప్రతి ఒక్కరికి ఇల్లు అనే కళ నెరవేరనుందని తెలిపారు.
అభివృద్ధి,సంక్షేమంలో తెలంగాణ టాప్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల సమాహారంగా రూపొందించిన ’ప్రగతి ప్రస్థానం? ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది’ పుస్తకాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేసిన పథకాలు, కార్యక్రమాలు, విధానాల ఫలితాలు తెలంగాణలోని గడప గడపకూ చేరాయని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచి, సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించాయని అన్నారు. ఫలితంగానే తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు
సాక్షాత్తు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అద్భుత పనితీరును ఇలాంటి నివేదికలెన్నో తేల్చిచెప్పాయని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుంధుబి మోగించిందని, 2023లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితమవుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు ప్రజలకు చేరువైన తీరును గణాంకాలతో సహా తన సంపాదకత్వంలో ’ప్రగతి ప్రస్థానం’ పుస్తకంగా వెలువరించిన సీనియర్ జర్నలిస్టు, సీఎం పీఆర్‌వో రమేష్ హజారీ కృషిని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ నాడు ఎట్లుండే.. నేడు ఎంతగా అభివృద్ధి చెందింది అనే విషయాలను తెలుసుకోగోరే ప్రతీ ఒక్కరికీ ఈ పుస్తకం ఒక హ్యాండ్ నోట్?గా ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణను సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా, తన సాహిత్య ప్రతిభతో సోషల్ విూడియాలోనూ, పాటలు, సాహిత్యం, పుస్తకాల రూపంలోనూ సృజనాత్మక విధానాల్లో ప్రభుత్వ కార్యాచరణను జనంలోకి తీసుకుపోయేలా సీనియర్ జర్నలిస్ట్ రమేష్ హజారీ పాటుపడుతున్న తీరును కేటీఆర్ ప్రశంసించారు.