నెలలో ఒకరోజు తల్లిదండ్రులు పాఠశాలకు రావాలి

ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్‌ను కలవాలి
రెండు నెలలు రాకుంటే రేషన్‌, ఫించన్‌ కోత విధిస్తాం
టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్రపాలిహెచ్చరిక
వరంగల్‌, జూన్‌6(జ‌నం సాక్షి): టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ హెచ్చరిక జారీ చేశారు. టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి నెల పాఠశాలకు రావాలని ఆమె ఆదేశించారు. రెండు నెలలు వరుసగా రాకుంటే వారి రేషన్‌, పింఛన్‌లో కోత విధిస్తామని హెచ్చరించారు. న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌తో కలిసి కలెక్టర్‌ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు కలెక్టర్‌ అమ్రపాలి, వినయ్‌భాస్కర్‌ అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమ్రపాలి మాట్లాడుతూ..  విద్యార్థులు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వ బడులను ప్రయివేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని  సూచించారు. రెండు వారాల్లో జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులందరికీ ఓ పరీక్ష పెడతామని, దాంట్లో ఏ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారో చూసి గుర్తిస్తామన్నారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి నెలా ఒక రోజులో తప్పనిసరిగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌ను కలవాలన్నారు. ఎవరైతే రెండు నెలలు రారో వాళ్లకు రేషన్‌, పింఛను కోత విధిస్తామని హెచ్చరించారు.