నేడు ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమాలు

వరంగల్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా డిసెంబర్‌ 1నపలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిడ్స్‌పై ప్రజల్లో చైతన్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఉదయం వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ నుంచి, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వేయి స్తంభాల దేవాలయం నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ వరకు ర్యాలీలు ఉంటాయన్నారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. ఇదిలావుంటే ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబరు1న జనగామ పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ బానోతు హరీశ్‌రాజ్‌ తెలిపారు. ఎయిడ్స్‌ రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఆ రోజున అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎయిడ్స్‌ చికిత్స కేంద్రంలో వైద్య సేవలందుకుంటున్న వ్యాధిగ్రస్థులకు మెరుగైన సేవలందించడానికి వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఎయిడ్స్‌పై ప్రజలు అవగాహన సెంచుకోవాలన్నారు.