నేడు కర్నాటక సీఎంగా శెట్టర్‌ ప్రమాణ స్వీకారం

బెంగుళూరు, జూలై 9 (జనంసాక్షి) : కర్నాటక రాజకీయం ఎన్నో మలుపులు తిరిగిన అనంతరం చివరికి ఓ కొలిక్కి వచ్చింది. బీజేపీఎల్పీ నాయకుడిగా మాజీ సీఎం యడ్యూరప్ప అనుచరుడు జగదీష్‌ షెట్టర్‌ మంగళవారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు షెట్టర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌ నాయకుడు అరుణ్‌ జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరవనున్నారు. కాగా కర్నాటక రాజకీయంలో మంగళవారం పలు కీలకాంశాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్‌కు తన రాజీనామా లేక ఇవ్వడానికి సదానందగౌడ షరతులను విధించారు. ఆయన తన వర్గం కోసం బీజేపీ ముందు మూడు డిమాండ్లను ఉంచారు. కీలక పదవులు తమకే ఇవ్వాలని, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకివ్వాలని, తన అనుచరుడు ఈశ్వరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సదానందగౌడ డిమాండ్‌ చేశారు. మరోవైపు కీలక పదవులను తమ వారికే యడ్యూరప్ప పట్టుబట్టడంతో ఎటూ తేల్చుకోలేనిపరిస్థితిలో బీజేపీ అధిష్టానం పడింది. ముఖ్యమంత్రిని మార్చితే పరిస్థితి చక్కబడుతుందని భావించిన బీజేపీకి సదానందగౌడ డిమాండ్ల రూపంలో చుక్కెదురైంది. దీంతో ఆ పార్టీ అధిష్టానం మళ్లీ భవిష్యత్తులో ఏ తలనొప్పి వస్తుందోనన్న ఆలోచనలో పడింది. సదానందగౌడ వర్గం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా ఏకంగా శాసనసభాపక్ష సమావేశానికి మంగళవారం డుమ్మా కొట్టి మరో షాక్‌ ఇచ్చారు. తన డిమాండ్లను అంగీకరించకుంటే బీజేపీఎల్పీ సమావేశానికి తాను, తన వర్గం ఎమ్మెల్యే హాజరుకాబోమని సదానందగౌడ తెగేసి చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా కొత్తగా ముఖ్యమంత్రి కానున్న షెట్టర్‌ను ఆ పదవి ఎంతకాలం వరిస్తుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.