నేడు దక్షిణాది రాష్ట్రాల.. కిసాన్ కాంగ్రెస్ సదస్సు

– హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ నేతలు
– జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
హైదరాబాద్, జనవరి28(జనంసాక్షి) : హైద్రాబాద్ లోని గాంధీభవన్ లో మంగళవారం దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ సమావేశం జరుగుతుందని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, సెల్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ నాయకులు హాజరవుతారని, రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష్యుడిగా అయిన తరువాత ఇది మొదటి కిసాన్ కాంగ్రెస్ సదస్సు అన్నారు. రైతులకు ఏవిధమైన మేలు చేయాలనే విషయంపై రాహుల్ దృష్టి పెట్టారని, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ కిసాన్ కాంగ్రెస్ కు బాధ్యతలు అప్పజెప్పారన్నారు. ఎన్నికల ముందు మోడీ అనేక వాగ్దానాలు ఇచ్చారని, కానీ ఒక్క హావిూ కూడా నెరవేర్చలేదన్నారు. పసల్ భీమా యోజనలో మార్పులు చేశారు, కానీ ఇన్సూరెన్స్ విషయంలో ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పారని విమర్శించారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు పంటకాలం అంచనా వేసేవారని, దానివల్ల రైతు కష్ట నష్టాలపై అంచనా ఉండేదన్నారు. రైతుల ఆత్మహత్యలు దేశంలో పెరిగిపోయాయని, భూసేకరణ చట్టం, రైతుకు ఏవిదంగా లాభం జరుగుతుందనే విషయాలపై కిసాన్
కాంగ్రెస్ సమావేశంలో ఇలాంటి రైతు సమస్యలన్నీ చర్చకు వస్తాయన్నారు. కొత్త పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ లక్ష రూపాయలు లంచం అడిగారని రైతు కుటుంబం బజార్లో బిక్షం ఎత్తుకున్న రాష్ట్రంలో రైతుల పరిస్థితి అన్నారు. మంగళవారం ఉదయం 9:30లకు జెండా ఆవిష్కరణ, 10గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారని, 10:20 కి రైతు అంశాలపై చర్చ, మధ్యాహ్నం 1:30 నుండి 2 గంటల వరకు లంచ్, 2గంటల తరువాత మిగిలిన అంశాలపై చర్చిస్తారని కోదండరెడ్డి తెలిపారు.



