నేనంటే మోదీకి దడ ` మమత ఫైర్
కోల్‌కతా,సెప్టెంబరు 25(జనంసాక్షి): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇటలీలో వచ్చేనెల జరుగనున్న ప్రపంచ శాంతి సదస్సుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం మమతాబెనర్జికి అనుమతి నిరాకరించింది. దాంతో ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. ‘ఇటలీలో ప్రపంచ శాంతి సదస్సు జరుగనుంది. నన్నుకూడా ఆ సదస్సుకు ఆహ్వానించారు. జర్మన్ ఛాన్సెలర్, పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆ సదస్సుకు హాజరుకానున్నారు. ఇటలీ ఆ సదస్సు కోసం నాకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. కానీ కేంద్రం మాత్రం అనుమతి నిరాకరించింది’ అని మమతాబెనర్జి చెప్పారు.అంతేగాక, ఇటలీకి వెళ్లకుండా విూరు నన్ను ఆపలేరు అని ప్రధాని మోదీని ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు. నాకు విదేశాలకు వెళ్లాలనే ఆతృత లేదు, కానీ ప్రపంచ శాంతి సదస్సుకు వెళ్లడం మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం అని మమత పేర్కొన్నారు. ‘విూరు ఎప్పుడూ హిందువుల గురించి మాట్లాడుతుంటారు. నేనూ ఒక హిందూ మహిళనే. మరి విూరెందుకు నన్ను అనుమతించలేదు. విూకు నేనంటే అసూయ’ అని మమత ప్రధాని మోదీపై మండిపడ్డారు.కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మమత మనం మన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాలిబని బీజేపీ దేశాన్ని పాలించకూడదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో టీఎంసీ ఒంటరిగా బీజేపీని ఓడిస్తుందని మమత ధీమా వ్యక్తంచేశారు. భవానీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికతో ఆట మొదలవుతుందని.. మేం దేశమంతటా విజయం సాధించిన తర్వాతే ఈ ఆట ముగుస్తుందని మమతాబెనర్జి పేర్కొన్నారు.