నేను ఎవర్నీ కలుసుకోలేదు 

– కుమారస్వామి ఆడియో క్లిప్పులు నకిలీవి
– ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా
– కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప
బెంగళూరు, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : ముఖ్యమంత్రి కుమారస్వామి రాజకీయ లబ్ధికోసం డ్రామాలాడుతున్నాడని, ఆయన విడుల చేసిన  ఆడియో క్లిప్పులు ‘నకిలీ’వని కర్ణాటక బీజేపీ చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప అన్నారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తమ ఎమ్మెల్యేలతో ఎడ్యూరప్ప బేరసారాలు సాగిస్తున్నారంటూ సీఎం కుమారస్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ ఎమ్మెల్యే నాగన గౌడ కుమారుడితో యడ్యూరప్ప మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో క్లిప్పులను సైతం సీఎం విూడియాకు విడుదల చేశారు. దీంతో ఇప్పటికే రాజకీయ సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న కర్ణాటకలో మళ్లీ కలకలం రేగింది. అయితే తాను సదరు ఎమ్మెల్యే గురించి ఎవరితోనూ మాట్లాడలేదనీ.. ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం ‘నిజం లేదని’ యడ్యూరప్ప పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడారు..ఇదంతా సీఎం అల్లిన ఓ ‘కట్టుకథ’ అని ఆయన పేర్కొన్నారు. ఇది ఓ నకిలీ ఆడియోనని, నేను ఎవర్నీ కలసుకోలేదన్నారు. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు, ఎమ్మెల్యేలు బయటికి పోకుండా కాపాడుకునేందుకే ఈ డ్రామా మొదలు పెట్టారని ఆయన పేర్కొన్నారు. తాను ఓ ఆలయాన్ని దర్శించుకునేందుకు దేవదుర్గ వెళ్లాననీ.. దర్శనం పూర్తయ్యాక అక్కడి నుంచి తిరిగి వచ్చేశానని ఆయన చెబుతున్నారు. ఎమ్మెల్యే నాగన గౌడ కుమారుడు శరణ్‌ గౌడతో ఎడ్యూరప్ప ఇక్కడే సమావేశం అయ్యారనీ.. వారి మధ్య జరిగిన సంభాషణ ఇక్కడే రికార్డు అయ్యిందని  ప్రచారం జరుగుతోంది. కాగా కుమారస్వామి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందనీ… అధికారంలో కొనసాగేందుకు ఈ ప్రభుత్వానికి ఇక అర్హత లేదని యడ్యూరప్ప అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిజం అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు.