నో టీకా.. నో ఎంట్రీ
` గుజరాత్ సర్కారు సంచలన నిర్ణయం
అహ్మదాబాద్,నవంబరు 11(జనంసాక్షి): కోవిడ్ టీకా తీసుకునే విషయంలో అలసత్వం ప్రదర్శించే వారికోసం గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా వేసుకోవడానికి అర్హత ఉన్నా.. తీసుకోని 18 ఏళ్లు పైబడిన వారికి నిర్దేశిత ప్రాంతాల్లో అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి ఈ ఉత్తర్వులు అమలౌతాయని పేర్కొంది.పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రజా రవాణాలో అనుమతి నిరాకరిస్తున్నట్లు అహ్మదాబాద్ మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ స్పష్టంచేసింది. అలాగే, లైబ్రరీ, స్విమింగ్‌పూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి చోట్లా వ్యాక్సిన్ వేసుకోని వారికి అనుమతించబోమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆయా చోట్ల ప్రవేశానికి ముందు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపించాలని పేర్కొంది. మరోవైపు ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 7.28 కోట్ల డోసులు పంపిణీ చేశారు. సుమారు నాలుగు నెలల తర్వాత బుధవారం రోజు కొవిడ్ కేసుల సంఖ్య 40 దాటింది.