పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటుతాం: ఎమ్మెల్యే

వరంగల్‌,మే30(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ శ్రేణులు సన్నందంగా ఉండాలని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఉమ్డి వరంగల్‌ జిల్లాలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అంతా సిద్దంగా ఉండాలన్నారు. బుధవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ పథకాలే తమ ప్రచారాంశాలన్నారు. కాంగ్రెస్‌ మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. ఓట్లు అడిగే నైతిక హక్కు మాకే ఉందని పంచాయతీ పోరు ద్వారా తమ సత్తా చాటుతామని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకెళ్తోందన్నారు. కొంత మంది ప్రతిపక్షాల పార్టీల నాయకులు అభివృద్ధిని ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలు గమనిస్తున్నారని ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగు లేదని, మరో 20 ఏళ్ల పాటు రాష్ట్రానికి సీఎంగా కేసీఆరే ఉంటారని దీమా వ్యక్తం చేశారు. త్వరలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర సర్కారు నోటిఫికేషన్‌ విడుదల కానుందని తెలిపారు. ఇప్పటికే ఓటరు లిస్టు సిద్ధం చేసి గ్రామాల వారీగా పంపారన్నారు. బూత్‌ స్థాయి కమిటీ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థిలనే గెలిపించేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలపై ప్రచారం చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ కన్న బంగారు కలలను నిజం చేద్దామన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నారు. వందశాతం సర్పంచ్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.  కనుమరగవుతున్న కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకవచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాయితీపై రుణాలను అందించారని తెలిపారు. రైతులను ఆదుకోవడం కోసం పంట పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేసి రైతుల్లో ఆనందం చూశామన్నారు.