పంట పెట్టుబడి నిరంతరం కొనసాగే  పథకం

రైతులందరికీ సాయం అందుతుంది
ఇబ్బందులుంటే 18 నుంచి వాటి పరిష్కారం 
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
వరంగల్‌,మే16(జ‌నం సాక్షి): భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి అందుతుంది. భూములకు సంబంధించి ఏవైనా ఇబ్బందులుండి ఇప్పుడు పంట పెట్టుబడి రాని రైతుల సమస్యలను మే 18వ తేదీ తర్వాత పరిష్కరించి, వారికి కూడా పంట పెట్టుబడి అందిస్తాం. రైతులకు పంట పెట్టుబడి ఇచ్చే ఈ రైతు బంధు పథకం ఇక నిరంతరాయంగా కొనసాగుతుందని  ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రైతు బంధు పథకంలో భాగంగా  మహబూబాబాద్‌ జిల్లా, గుడూరు మండలం, అప్పరాజుపల్లి గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్‌ బుక్కులు, చెక్కులు పంపిణీ చేశారు. నాలుగేళ్ల కింద వ్యవసాయం అంటే గిట్టుబాటుకానిదిగా, దండగగా ఉండేనని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండగగా మార్చేందుకు సిఎం కేసిఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడు రైతు పంట పెట్టుబడి కోసం ఎవరివైపు చూడకుండా ఉండేందుకు ఎకరానికి 4000 చొప్పున ఏటా 8000 రూపాయల ఆర్ధిక సాయం చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఇంత వరకు రైతుకు
పంట పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వంగానీ, నాయకులుగానీ లేరన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పంట పెట్టుబడి పథకంవైపు దేశం మొత్తం చూస్తోందన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, వ్యవసాయానికి కనీసం రెండు గంటలు కూడా కరెంటు రాని పరిస్థితిని మార్చి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారని, కోటి ఎకరాలను మాగాణాగా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారని అన్నారు.రైతులకే కాకుండా పేదింట్లో ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని మొదట్లో 51వేల రూపాయలు ఇచ్చారని, అది సరిపోదని దానిని 75వేల రూపాయలకు పెంచారని, అదీ చాలడం లేదని ఇప్పుడు లక్షా 116 రూపాయలను ఇస్తున్నారన్నారు. పేదింట్లో ఆడపిల్ల గర్భం దాల్చితే ప్రసవం అయ్యే వరకు పని చేయాల్సి వస్తుందని గుర్తించిన సిఎం కేసిఆర్‌ ఇక అలాంటి పరిస్థితి ఉండొద్దని ప్రసవానికి మూడు నెలల ముందు, ప్రసవం తర్వాత మూడు నెలల వరకు నెలకు 2000 రూపాయల చొప్పున ఆరు నెలల పాటు 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలు కలిపి 13వేల రూపాయలు అందిస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా తల్లిబిడ్డలను అమ్మఒడి వాహనంలో ఇంటి దగ్గర దించుతున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని అన్నారు. ఇంతటి మంచి పథకాలు అమలు చేస్తున్న సిఎం కేసిఆర్‌ ను నిండు మనసుతో దీవించాలని కోరారు. అప్పరాజు పల్లిలో ఇప్పటి వరకు ప్రాథమికోన్నత పాఠశాల మాత్రమే ఉందని, ఈ ఏడాది నుంచే దానిని ఉన్నత పాఠశాలకు అప్‌ గ్రేడ్‌ చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అదేవిధంగా అప్పరాజు పల్లి నుంచి మహబూబాబాద్‌ వెళ్లడానికి మున్నేరు వాగుపై చెక్‌ డ్యామ్‌ కట్టాలన్న గ్రామస్తుల డిమాండ్‌ ను నీటి పారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకొళ్లి మంజూరు చేయిస్తానన్నారు. అదేవిధంగా రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం అప్పరాజు పల్లి, గోవిందాపురం, దామెరంచ గ్రామాలకు గ్రామానికి 10 లక్షల రూపాయల చొప్పున 30 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, కలెక్టర్‌ శివలింగయ్య, జాయింట్‌ కలెక్టర్‌ దామోదర్‌ రెడ్డి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.