పక్షం రోజులుగా నీళ్లు రాక అల్లాడుతున్న మదునన్న నగర్.

వరదల కాలంలోనే నీళ్లు రాక తిప్పలు.
– ఎండా కాలంలో అయితే చెప్పే అవసరమే లేదు.
– మిషన్ భగీరథ ఒక వ్యధగా మారింది.
బెల్లంపల్లి, జులై 23, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని మదునన్న నగర్ లో మున్సిపాలిటీ నల్లా నీళ్లు రాక పదిహేను రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కూడా నీటి తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో అంటే నీటి కొరత కారణంగా పదిహేను రోజులకు ఒకసారి నల్లాలు వచ్చినా ఓపిక పట్టామని, కానీ ఓవైపు వర్షాకాలం, ఇంకా భారీ వర్షాలు కురిసి వరదలు వస్తున్న తరుణంలో కూడా నీటి తిప్పలు తప్పడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం అయితే మదునన్న నగర్ కి ఆమడ దూరంలో ఆగిపోయింది. కనీసం భగీరథ పైపు లైన్ కూడా వేయకపోవడంతో మున్సిపాలిటీ నల్లా నీరే దిక్కు అయింది. నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి రోజు కాకపోయినా దినం తప్పించి దినం నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.