పచ్చదనం కోసం పాటుపడ్డవారికి హరితమిత్ర పురస్కారాలు

15లోగా దరఖాస్తులకు ఆహ్వానం
వరంగల్‌,మే5(జ‌నం సాక్షి ):  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల నుంచి హరిత మిత్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో రూ.1 లక్ష నుంచి రూ.15 లక్షల వరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతితోపాటు పురస్కారం అందుతుందన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99482 86586 గల సెల్‌ నంబర్‌లో జిల్లా అటవీశాఖ అధికారిని సంప్రదించాలన్నారు. హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటడంతోపాటు సంరక్షణ కోసం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని  పేర్కొన్నారు.  జులైలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సరఫరా చేయడానికి నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా కలిగే ప్రయోజనాలను అవగాహన కల్పించాలన్నారు. గ్రామ అవసరాల మేరకు ఉపాధి హావిూ కార్డులు కలిగిన రైతు కూలీలను భాగస్వామ్యం చేస్తూ పాంఫౌండ్‌ నిర్మాణం, చెరువు పూడిక పనులు, రోడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టాలన్నారు. ఇదిలావుంటే ప్రతి నెలా ప్రభుత్వ పాఠశాలల్లో బడికి రాకుండా 80 శాతం హాజరుకాని విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు రేషన్‌ బియ్యం, ఇతర సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని కలెక్టర్‌ ఆమ్రపాలి పేర్కొన్నారు. వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు రూ.2 లక్షలు, 10 శాతం 10 జీపీఏ సాధించిన పాఠశాలలకు రూ.5 లక్షలు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. రాబోయే విద్యాసంవత్సరం మరింత కృషి చేసి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. ఇందుకోసం ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఇకపోతే అర్బన్‌ జిల్లాలో వంద శాతం బాల కార్మికులు లేని జిల్లాగా ప్రకటించుటకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు. గత మాసం నిర్వహించిన సర్వేలో 338 మంది బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించామన్నారు. వ్యాపార సముదాయాల్లో బాలకార్మికులపై చేసిన సర్వే ఆధారంగా బాల కార్మికులు లేని జిల్లాగా ప్రకటించుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 14 ఏళ్లలోపు చిన్నారులు ఎక్కడైనా పని చేస్తున్నట్లు తెలిస్తే కలెక్టర్‌ కార్యాలయంలో సమాచారం అందించాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా యంత్రాంగం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలతో పని చేయిస్తే జరిమానాతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
—————–