పచ్చని సంసారంలో ఫోన్ చిచ్చు..
దుండిగల్: ఫోన్ విషయంలో భార్యతో గొడవ జరగడంతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దుండిగల్ ఎస్ఐ పవన్ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన యహోషువా (24), మనీషాలు ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 11 నెలల పాప ఉంది. మనీషా ప్రస్తుతం గర్భవతి. వీరు ఏడాది క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి గండిమైసమ్మ శ్రీరామ్‌నగర్ లో ఉంటున్నారు. యహోషువా స్థానిక ప్రైవేట్‌పరిశ్రమలో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు.
మనీషాను చూసేందుకు ఆమె తల్లిదండ్రులు ఆదివారం వచ్చారు. వారితో యహోషువా మాట్లాడకుండా ముభావంగా ఉన్నాడు. మనీషాకు తల్లిదండ్రులు ఇంటి సామగ్రితో పాటు ఫోన్ కొనిచ్చారు. తనకు తెలియకుండా ఫోన్‌ను ఎలా కొనిస్తారంటూ యహోషువా భార్య తో గొడవ పడ్డాడు. ఇదే క్రమంలో రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన అతను 11 గంటల సమయంలో ఉరేసుకొనేందుకు యత్నించగా భార్య అడ్డుకుంది. తర్వాత నిద్రకు ఉపక్రమించారు. కాగా, తెల్లవారుజాము 4 గంటలకు మనీషా నిద్రలేచి చూసేసరికి భర్త ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.