పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పెంపు
వరంగల్,ఫిబ్రవరి14(జనంసాక్షి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోని వారు ఈ నెల 19లోగా నమోదు చేసుకోవాలిన అధికారులు సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడడంతో పట్టభద్రులు తమ నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం గడువు పెంచింది. మార్చి 16న జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రులు ఓటరుగా నమోదుకు ఈ నెల 19 వరకు అవకాశమిచ్చారు. వరంగల్,ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రులందరికీ ఈ సమాచారం అందించి వారిని చైతన్య పరచాలని అధికారులకు ఆదేశాలందాయి. ఇప్పటికే ఈ మూడు జిల్లాల్లో 278 పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు ఆ మేరకు ఇసికి నివేదించారు. వరంగల్ జిల్లాలో 97,448 మంది ఓటర్లు, నల్లగొండ జిల్లాలో 85,974 మంది, ఖమ్మం జిల్లాలో 79,160 మంది పట్టభద్రులైన ఓటర్లున్నట్లు వెల్లడించారు. మూడు జిల్లాల్లో మొత్తం 2,62,582 మంది ఓటర్లున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఓటరు నమోదు గడువు పెంచిన నేపథ్యంలో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మూడు జిల్లాల్లో కలిపిమరో పదివేల వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.